హైదరాబాద్ శివారులోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు కూడా పెరుగుతున్నాయి. లావాణి చట్టాలను ఉల్లంఘిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. లావాణి పట్టాదారులే తమ వైపు ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు ఏమి చేస్తారనే ధీమాతో దర్జాగా లావాణి భూములను కబ్జా చేయడంతోపాటు అక్రమంగా నిర్మాణాలను కూడా చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసి జరుగుతున్నాయా..? లేక వారి కళ్లు కప్పి కబ్జాలకు పాల్పడుతున్నారా అనే విమర్శలు ప్రజల నుంచి పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
– మొయినాబాద్, మే 13
మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామ రెవెన్యూలో సర్వే నం.105/3/1లోని భూముల వెనుక భాగంలో ఓ వ్యక్తి 20 ఏండ్ల క్రితం సుమారు 80 ఎకరాల వరకు కేతిరెడ్డిపల్లి రెవెన్యూ, చాకలిగూడ రెవెన్యూలో భూములను కొనుగోలు చేశాడు. భూములకు ముందు భాగంలో పంచాయతీరాజ్ రోడ్డును ఆనుకుని ఉన్న వెంకటాపూర్ రెవెన్యూలో సర్వే నం.105లో లావాణి భూములున్నాయి. కొనుగోలు చేసిన ప్రైవేట్ భూములకు దారి లేకపోవడంతో ఆ భూములను అమ్ముకోవడం చాలా కష్టంగా భావించిన సదరు వ్యక్తి పంచాయతీరాజ్ రోడ్డును ఆనుకుని ఉన్న లావాణి భూమి పట్టాదారుల నుంచి 20 ఏండ్ల క్రితం దారి తీసుకున్నాడు. లావాణి భూముల నుంచి దారి వేసి ఆ భూములను రియల్ వ్యాపారులకు విక్రయించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొనుగోలు చేసి భూములకు దారి ఉందని రియల్ వ్యాపారులు వెంచర్ చేసి వినియోగదారులకు ప్లాట్లను విక్రయించారు. వినియోగదారులు అందులో ఇండ్లు కూడా కట్టుకున్నారు. అయితే లావాణి భూమి పట్టాదారుల పిల్లలు, అన్నదమ్ముల మధ్య అదే భూమికి సంబంధించి వచ్చిన గొడవల వల్ల రెండేండ్ల క్రితం లావాణి భూమి నుంచి ఉన్న దారిని తీసివేశారు. వెంచర్‌కు దారి లేకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాత్కాలికంగా వెళ్లారు. కాని ప్రస్తుతం చుట్టుపక్కల భూములు సైతం అమ్ముడుపోవడంతో వినియోగదారులు ఆ వెంచర్‌కు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కొనుగోలుదారులు వెంచర్ చేసినవారిపై దారి కోసం ఒత్తిడి పెంచడంతో మళ్లీ లావాణి భూమి నుంచి దారి తీసుకున్నారు.
ప్రస్తుతం కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న లావాణి పట్టాదారులకు డబ్బులిచ్చి దారి చేసుకున్నారా..? లేక ఏదైనా ఒప్పందం చేసుకుని రియల్ వ్యాపారులు దారి వేసుకున్నారా..? అనే పలు కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులిచ్చినా.. ఎలాంటి ఒప్పందాలు చేసుకున్న లావాణి భూములను సాగు చేసుకుని జీవనాధారం పొందడం తప్ప ఎలాంటి దారులు వేయడం కాని, ఎలాంటి నిర్మాణాలైనా చేస్తే అది లావాణి చట్టం ఉల్లంఘనే అవుతుంది. గతంలో ఓ వ్యక్తికి అమ్మినప్పుడు వచ్చిన డబ్బుల కోసమే అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడి రెండేండ్ల క్రితం దారిని మూసివేశారు.
మూసి వేసిన దారి మళ్లీ ఓపెన్ చేయడంతో ప్రస్తుతం అదే లావాణి భూమి నుంచి అక్రమంగా 30 ఫీట్ల వెడల్పు, 600 ఫీట్ల పొడవుతో రోడ్డును వేశారు. రోడ్డు వేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ప్రీకాస్టు గోడ నిర్మాణం చేపట్టి పంచాయతీరాజ్ రోడ్డు పక్కన లావాణి భూమిలో వేసిన రోడ్డుకు గేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 30 గంటల భూమి నుంచి దర్జాగా రోడ్డు వేసి, ప్రీకాస్టు పెట్టి, గేట్ వేయడం అంటే ఎవరి అండదండలతో వేస్తున్నారని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డు పక్కనే ఈ బాగోతం జరుగుతున్నా రెవెన్యూ అధికారుల కంట పడలేదా..? పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరి అండదండలతో ఇలాంటి కబ్జాలకు పాల్పడుతున్నారని, ఏ ప్రజాప్రతినిధుల హస్తం ఈ కబ్జాల పర్వంలో ఉందో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి కబ్జాలకు పాల్పడిన వ్యక్తులపై, మద్దతు ఇస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లావాణి భూములు పేదలకు సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములు మాత్రమే. కానీ లావాణి చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం అమ్మడం కాని, కొనుగోలు చేయడం కాని చేయడం చట్ట విరుద్ధం. ప్రైవేట్ వ్యక్తులు సైతం ఆ భూముల్లో నుంచి రోడ్లు వేసుకోవడం కాని, నిర్మాణాలు చేపట్టడంకాని చట్ట విరుద్ధం. ఆ భూములు సాగు చేసుకోవడం తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్డం, డబ్బులు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు దారులివ్వడం వంటివి చేస్తే పట్టాదారులపై, దారులు వేసుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ఎలాంటి దారులు వేసినా, నిర్మాణాలు చేపట్టినా కూల్చివేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– గౌతంకుమార్, తహసీల్దార్, మొయినాబాద్