కడ్తాల్, జూన్ 26 : మండలంలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్ 97లో చేపట్టిన అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని రేకులకుంట తండాకి చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, మైనింగ్ పనులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ముంతాజ్ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. సాలార్పూర్, రాంనుంతల, ఎడవెల్లి మూడు గ్రామాల అటవీ శివారులలో, తప్పుడు సర్వేలు నిర్వహించి కంపెనీ యాజమాన్యం మైనింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారని తెలిపారు. రాంనుంతల, సాలార్పూర్, ఎడవెల్లి గ్రామాలకు సంబంధించిన అటవీ భూములను అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరారు. ఇది వరకు మైనింగ్ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకోనే క్రమంలో… గవర్నమెంట్ ఈసీ అభ్యంతరం తెలిపారని, తప్పుడు ఎన్ఓసీ, కోఆర్డినస్ సమర్పించి అనుమతులు పొందిన్నట్లు వారు ఆరోపించారు. మూడు గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూ సర్వే చేపట్టాలని, తప్పుడు పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో ఈ మైనింగ్ గురించి సంబంధింత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా పనులు నిలిపివేశారని గిరిజనులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల మైనింగ్ పనులను తిరిగి ప్రారంభించారని దీంతో రేకులకుంట తండాలోని ప్రజలతోపాటు పశువులకు, అటవీ జంతువులకు రక్షణ లేకుండా పోతుందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నరేశ్నాయక్, తులసీరాం, బీచ్యా, హున్యా, రాజు, గణేశ్, రాజా, లలిత, సీత, జమానీ, జంప్లీ తదితరులు పాల్గొన్నారు.