వికారాబాద్, డిసెంబర్ 6 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి వాటిని అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ అమాయక బీసీ యువకుడు సాయిఈశ్వరాచారి ప్రాణాన్ని బలితీసుకున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పలువురు బీసీ నాయకులతో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సాయిఈశ్వర్చారి మృతికి శ్రద్ధాంజలి ఘటించాడు.
ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారని, మేమంతో-మాకంతా అనే నినాదంతో ఉన్నారన్నారు. ప్రభుత్వం చేసిన కుల గణనలోనూ బీసీలు 56 శాతానికిపైగా ఉంటే ఏ ప్రాతిపదికన 42శాతం రిజర్వేషన్లు ప్రకటించారని.. మిమ్మల్ని 42 శాతం ఎవరు అడిగారని ప్రశ్నించారు. మీరు 42 శాతం ఆశ చూపి నేడు పం చాయతీ ఎన్నికల్లో 17శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని పలు మండలాల్లో 11,13 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
సాయిఈశ్వర్చారి మరణానికి ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు కారణమని వారిపై కేసు నమోదు చేయాలన్నారు. బీసీలందరూ తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేసి స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా, ఉద్యోగాలు, చట్ట సభల్లోనూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు గుడిసె లక్ష్మణ్, తెలంగాణ జేఏసీ జిల్లా మాజీ చైర్మన్ శ్రీనివాస్, యాదగిరి యాదవ్, శేఖర్, లక్ష్మణ్‌రావు, గోపాల్, రాజశేఖర్, లక్ష్మణ్, గంగూలుయాదవ్, సురేశ్‌గౌడ్, లాలయ్య, విజేందర్ గౌడ్ పాల్గొన్నారు.