రంగారెడ్డి, మే 9(నమస్తేతెలంగాణ): భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్’ అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి దేశభక్తిని చాటుకుంటున్నారు. యుద్ధంలో భారతసైన్యం విజయం సాధించాలన్న ఆకాంక్షతో పెద్దఎత్తున ఊరూవాడా కదిలింది. భారతసైన్యం జరుపుతున్న పోరులో మేముసైతం అంటూ సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గురు, శుక్ర వారాల్లో సైన్యానికి మద్దతుగా సంఘీభావం ర్యాలీలు నిర్వహించారు. కడ్తాల్ మండలంలోని మైసిగండి అమ్మవారి ఆలయంలో భారత సైన్యానికి మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే, జిల్లాలోని వివిధ ఆలయాల్లో కూడా శుక్రవారం భారత సైన్యానికి మద్దతుగా పూజలు చేశారు. బాటసింగారం పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భారత సైన్యానికి మద్దతుగా నిర్వహించిన సంఘీభావ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. భారతమాతతో ఊరేగింపుగా పలు కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్థాన్ మరోమారు భారత్‌పై కన్నెత్తి చూడటానికి భయపడే విధంగా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు.
భారత్ – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని హైదరాబాద్ సరిహద్దులోని రాజేంద్రనగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఉంటే వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పాకిస్థాన్ సానుభూతిపరుల కోసం తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
గురువారం రాత్రి భారత్ – పాకిస్థాన్‌ల మధ్య జరిగిన భీకర పోరు నేపథ్యంలో ప్రజలు టీవీలకు అత్తుకుపోయారు. రాత్రిపూట జరిగిన బాంబులు, మిస్సైళ్లు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన నేపథ్యంలో ప్రజలంతా టీవీల వైపు ఆసక్తిగా చూశారు. ఈ పోరులో భారతసైన్యం విజయం సాధించాలని అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
భారత్ – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో మాజీ సైనికునిగా తనకు అవకాశమిస్తే దేశం కోసం పోరాడుతానని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మాజీ సైనిక ఉద్యోగి వీకేచారి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్‌పై చేసిన దాడులు దేశ భద్రతకు సంబంధించిన ఓ ఘనమైన చర్య అని అభివర్ణించారు. మన సైనికులు తీవ్రవాద సంస్థలకు, దేశ శత్రువులకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాక్ ముష్కర మూకలను మట్టుబెట్టిన ప్రతి ఒక్క త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం అన్నారు.
ముఖ్యంగా దేశంలో పాకిస్థాన్ చొరబాటు దారులు అశాంతి, ప్రాణనష్టమే ధ్యేయంగా కల్లోలం సృష్టిస్తున్నారన్నారు. తీవ్రవాదం అనేది మానవత్వానికి వ్యతిరేఖమని, అది భయంతో నడిపించే క్రూర మానసిక రుక్మత అని అన్నారు. దీనిపై మనమందరం కఠినంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని, దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా.. ఎలాంటి రూపంలో వచ్చినా తీవ్రవాదాన్ని సహించేది లేదని నిరూపించే సమయం ఇదే అని అన్నారు. దేశంకోసం మన సైన్యం చేస్తున్న పోరాటానికి మనమందరం మద్దతు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.
-వీకే చారి, మాజీ సైనిక ఉద్యోగి
భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా పాకిస్థాన్ వంటి దేశాలు భయపడే విధంగా మన సైనికులు చేస్తున్న పోరాటానికి మనమంతా అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైంది. సైనికులకు సంఘీభావంగా ర్యాలీలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దేశవ్యాప్తంగా భారతదేశ ప్రజలంతా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు