శంకర్పల్లి, ఫిబ్రవరి 3 : హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమె మున్సిపాలిటీలోని ఆరు, ఏడో వార్డు ల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తు కు ఓటేసి అభివృద్ధిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. గత రెండేండ్లుగా రాష్ట్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ ఎలాంటి అభివృద్ధి జరుగలేదని.. హామీల అమల్లో విఫల మైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రేవంత్‌రెడ్డి పాలన అంతా గందరగోళంగా మా రిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అనడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. దేశానికి జాతిపితగా గాంధీని గుర్తించినట్లే, తన ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏండ్లు పోరాడి కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం లో పాలన పడకేసిందని, అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందని ఆరోపించారు. తెలంగాణ సాధించిన నాయకుడికి నోటీసు లు జారీ చేయడం, ఆయన మరణాన్ని కోరే స్థాయికి దిగజారడం ఏం సంస్కారమని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావు చివరికి కేసీఆర్‌కూ నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశమేనని, అధికారులకు తెలిసే జరుగుతున్నదన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఉద్యోగం కావాలని ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం దారుణమని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు అత్యధిక స్థానాలను కట్టబెడతారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చిన నర్సింహులు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.