తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. రైతు ఏ కారణం చేత మృతి చెందినా ఆ కుటుంబానికి రూ.రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలుస్తున్నది. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల లోపు రైతులందరూ ఈ పథకానికి అర్హులు. గుంట భూమి ఉన్న రైతు కుటుంబం సైతం రైతుబీమాను పొందవచ్చు. రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది 1,230 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసి ఆదుకున్నది. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ రైతుల్లో ధీమాను నింపుతున్నది. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రంగారెడ్డి జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రంగారెడ్డి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : పొరుగువారి పాలనలో ఇంతకాలం అణిగిమణిగి ఉన్న పాలితులకు శ్రేయోదాయకమైన సంక్షేమ పాలన అందించాలని తెలంగాణ ప్రభుత్వం, అధినేత అయిన కేసీఆర్ పూనుకున్నారు. ఆ రకంగా ప్రజలకు పాలన అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను తెచ్చి ప్రభుత్వం వారి శ్రేయస్సుకు కృషి చేస్తున్నది. అందులోభాగంగా రైతు సంక్షేమానికి సాయం కూడా అందిస్తున్నది. పంటల సాగుతో రైతులు ఇబ్బందులు పడొద్దు.. అప్పులపాలు కావొద్దనే ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ‘రైతు బంధు’ను తెచ్చి, ఎకరానికి ఐదువేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రపంచానికే అన్నం పెట్టే అన్నదాత కాలం చేస్తే, బాధిత కుటుంబసభ్యులు రోడ్డున పడొద్దని.. వారిని సైతం ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్నది.
రైతులకు సాయం చేయడం మాత్రమే తెలుసని, అలాంటి రైతుని ఆదుకుంటేనే రేపటి ప్రపంచాన్ని మనమంతా చూడగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో రైతులకు ‘బంధు’, ‘బీమా’ను అందిస్తున్నారు. వ్యవసాయం దండుగ అని గత పాలకులు చెప్పినా.. వ్యవసాయమే పండుగ అని ప్రతి రైతును ప్రోత్సహిస్తూ, వారికి అధికారుల నుంచి కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తూ, ప్రభుత్వం చేదోడువాదోడుగా చాలినంత సహాయం అందిస్తున్నది. రైతు బీమా పథకం రైతుల కుటుంబానికి ఆకాశమంత అండగా నిలుస్తున్నది. గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఈ పథకంలో అవకాశం కల్పించడంతోపాటు బీమా ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ఇంటి పెద్ద ప్రమాదం, లేదా సాధారణంగా మరణించినా ‘బీమా’ సొమ్ము అందుతున్నది. దీంతో వ్యవసాయ సాగు కుంటుపడకుండా కొనసాగుతుంది.
స్వల్ఫ వ్యవధిలోనే ‘బీమా’ సొమ్ము
తెలంగాణ ప్రభుత్వం 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకు ‘రైతు బీమా’ వర్తించేలా చర్యలు చేపట్టింది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబంలో నామినీకి పది రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అందుతాయి. రైతు బీమా పథకం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా బీమా మొత్తం లభిస్తుంది. రైతు శ్రేయస్సుకు, పంటల సాగు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆకాశమంత అండగా నిలుస్తున్నాయి. రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి కావొద్దనే ఆకాంక్షతో వారి బతుకులకు సీఎం భరోసా కల్పించారు.
1230 మందికి ‘బీమా’
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సాగుకు నీళ్లు, నిధులు రావడంతో అన్నదాతకు వ్యవసాయం పండుగలా మారింది. దీంతో రైతులు గత ప్రభుత్వాల హయాంలోగా కాకుండా తమ దృష్టిని సాగు వైపునకు మళ్లించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1230 మంది రైతులు గత ఏడాది కాలం చేశారు. రూ.5 లక్షల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు అందించి తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకున్నది. ఒక్కో రైతు కుటుంబానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలకు రూ.62.50 కోట్లు చేరాయి.
‘బీమా’ సాయం అందింది
– కోనేటి రాజు, వెంకమ్మతండా
మా నాయన ఆరు నెలల క్రితం చనిపోయిండు. మా కుటుంబానికి పెద్ద దిక్కు మా నాయన. ఆయన పోయినంక వ్యవసాయం కుంటుపడుతుందని అనుకున్నం. కాని, ‘రైతు బీమా’ ద్వారా సీఎం కేసీఆర్ సారు మా కుటుంబాన్ని ఆదుకొని, ఆర్థికంగా సాయం అందించిండ్రు. మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. సాగుకు ఈ సాయం మాకు ఉపయోగపడుతుంది.
ప్రతి రైతును ప్రోత్సహిస్తున్నాం
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
ప్రతి రైతును ప్రోత్సహిస్తూ, వారికి అధికారుల నుంచి కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తున్నాం. రైతు మరణానంతరం, ప్రభుత్వ విధి విధానాలు, నియమ నిబంధనల ప్రకారం, రైతు ఇచ్చిన నామినీ ఖాతాల్లో రైతు బీమా డబ్బులు జమవుతాయి. రైతు పేరిట గుంట భూమి ఉన్నా రైతు బీమా పథకం వర్తిస్తున్నది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1230 మందికి రైతు బీమా డబ్బులు అందాయి.
రైతుల జీవితాల్లో వెలుగులు…
తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. నాకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేస్తున్నా. నాన్నగారు చనిపోయి ఐదు నెలలు అవుతున్నది. మాకు రైతు బీమా సాయంగా రూ.5 లక్షలు అందాయి. ఇంటి పెద్దదిక్కు పోయి నానా ఇబ్బందులు పడ్డాం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం రైతుబీమాను అందజేసి ఆదుకున్నది. అన్నదాతల కోసం ఆలోచించే సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– తుప్పరి రాకేశ్, నాగిరెడ్డిగూడ, మొయినాబాద్ మండలం