ఇబ్రహీంపట్నం, జూన్ 14 : నిరుపేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్నదాతల్లో జూన్ నెల గుబులు పుట్టిస్తున్నది. ఈ నెలలో వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చు లూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెల లో అధికంగా వెచ్చించాల్సి రావడంతో సాగుదారులు, సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. జూన్ నెల గట్టెక్కేంత వరకూ అష్టకష్టాలను ఎదుర్కొంటుంటారు. గత బీఆర్ఎస్ హయాంలో పంటల సాగుకు ముందే రైతుబంధు పెట్టుబడి సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో అంతగా ఇబ్బందులుండేవి కాదు.
కానీ, కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా పెట్టుబడి సాయం అందకపోవడంతో అటు పంటలకు పెట్టుబడులు…ఇటు పిల్లలకు పాఠశాలల ఫీజులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నగరానికి వచ్చి అద్దె ఇండ్లలో ఉండడంతో ఖర్చు తడిసి మెపెడవుతున్నది. ఏడాదంతా దాచుకున్న సొమ్ము ఒక్క జూన్ నెలలోనే ఆవిరి అవుతున్నది. ప్రభుత్వం స్పందించి రైతుభరోసా సాయాన్ని అంది స్తే కొంతమేరకైనా పెట్టుబడులకు ఆసరా గా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
నర్సరీ మొదలు డిగ్రీ…ఆపై ఉన్నతస్థాయి విద్యాభ్యాసం చేయాలంటే ఖర్చులు పెడాదికేడాది పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివితే అడ్మిషన్ ఫీజు, ఏడాది ఫీజు, పుస్తకాలు, స్టేషనరీ, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, షూ, ట్యూషన్‌ఫీజు, లంచ్ బాక్స్‌లు, వాటర్‌బాటిళ్లు, బ్యాగులు, రవాణా చార్జీ లు ఇలా ఖర్చులు అధిక మొత్తంలో పెరిగిపోతున్నా యి.
పాఠశాల, కళాశాలల ఆధారంగా అంతే పెద్దమొత్తం ఖర్చు చేయాల్సి వస్తున్నది. హాస్టళ్లలో ఉంటే వాటి ఫీజులు అదనంగా భరించాల్సిందే. విద్యాసంస్థల్లో విడతల వారీగా ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నా పెద్ద మొత్తంలోనే విద్యా సంవత్సరం ఆరంభంలోనే వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకూ నోట్‌బుక్స్, స్టేషనరీ, వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రంక్ బాక్స్, డ్రెస్‌లు, ఇతర ఖర్చులు కూడా పెరుగుతుండడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు పెట్టుబడి వ్యయం ఎంతో అవసరం. వ్యవసాయంలో ఎడ్లు, బండ్లు, నాగళ్లు, అరకలు దాదాపుగా కనుమరుగై యాంత్రీకరణ అమాంతంగా పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులు పెనుభారమవుతున్నాయి. ఏ పంట వేయాలన్నా ట్రాక్టర్‌తో దున్నించినందుకు ఎకరానికి రూ.20 వేలకు పైగానే ఖర్చవుతున్నది.
ఇక విత్తనాలు, ఎరువులు, నాట్లు వాటి ఖర్చులూ గణనీయంగా పెరిగాయి. అన్నదాతను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేలను సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, ఎరువు లు, విత్తనాలను సబ్సిడీపై ఇవ్వడం వంటివి అన్నదాతలను ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. కాంగ్రెస్ వచ్చాక ఆ పరిస్థితి లేకుండా పోవడంతో కర్షకులు మళ్లీ అధిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. మళ్లీ వెనుకటి కాలం వచ్చిందని, పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయాన్ని వదిలి మళ్లీ బొంబాయి, దుబాయి ప్రాంతాలకు వల స వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.
వానలు కురుస్తుండడంతో అన్నదాతలు వరి, కూరగాయల పంటలను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అదునుకు ముందే పంటల సాగు కోసం పెట్టుబడి సాయం అందేది. కానీ, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత.. పంటల సాగు ప్రారంభమైనా నేటికీ రైతు భరోసా సాయం అందలేదు. కూలీలు, ట్రాక్టర్ల ధరలు పెరిగి పోవడంతో ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసి ఆదుకోవాలి.
-చిలుకల బుగ్గరాములు