గత బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా చేసు కున్నారు. సీజన్‌కు ముందే రైతుబంధు పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుకునేది. కానీ, 17 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. రైతుబంధు పేరుతో ఉన్న పథకాన్ని రైతుభరోసాగా మార్చింది. ఓ వైపు రైతుభరోసా పెట్టుబడి సాయం అర్హులందరికీ అందకపోగా, బ్యాంకర్లు పంట రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నాడు అన్నదాత..
వికారాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల కో సం చూడని రైతన్న పంటల సాగుకోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. కేసీఆర్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులను కొ నేందుకు రైతుబంధు సాయం అందగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతున్నా అర్హులందరికీ రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ కాకపోవడంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం రైతును రాజుగా చేయాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడంతో పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. కాగా, రేవంత్ ప్రభు త్వం పవర్లోకి వచ్చిన నాటి నుంచి ఓ వైపు పెట్టుబడి సాయం అందకపోగా, బ్యాంకర్లు పంట రుణాలనూ మంజూరు చేయకపోవడంతో అన్నదాత అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించి అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకో గా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విడతల వా రీగా పెట్టుబడి సాయాన్ని అందించి ఆగం చేసింది. మొదట మండలానికి ఒక గ్రామా న్ని ఎంపిక చేసి, అందులోనూ తక్కువ జనా భా ఉన్న ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా సాయాన్ని అందజేసింది. తదనంతరం ఒక్క ఎకరం, రెండెకరాలు ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కాగా, జిల్లా లో అర్హులుగా గుర్తించిన రైతుల్లో ఇంకా దాదాపుగా 86,872 మందికి పెట్టుబడి సా యం అందాల్సి ఉన్నది.
రైతుభరోసా కోసం అన్నదాతలు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు వానకాలం సమీపిస్తున్నా ఇంకా యాసంగి రైతుభరోసా అందకపోవడంతో తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. కాగా జిల్లాలోని 3,12,872 మంది రైతులకు రూ.385.46 కోట్ల రైతుభరోసా సాయాన్ని అందించాలని అధికారులు నిర్ణయించ గా, ఇప్పటివరకు నాలుగెకరాల్లోపు 2,26,000 మం ది రైతులకు రూ. 212. 52 కోట్ల సాయాన్ని మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగ తా రైతులకు సాయం ఎప్పుడు జమ అవుతుందనేది అధికారులు కూడా స్పష్టత ఇవ్వడంలేదు. రైతుభరోసా సాయం అర్హులందరికీ పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు బ్యాంకర్లు అరకొర రుణాలనే మంజూరు చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యంలో 55% మేర రుణాలనే మం జూరు చేశారు. ఈ ఏడాది వానకాలం, యాసంగిలకు రూ. 3,547 కోట్ల రుణాలివ్వాలని టార్గెట్‌గా పెట్టుకుని రూ. 2,014 కోట్ల రుణాలనే రైతులకు ఇచ్చారు. అర్హుల్లో కొంతమందికే రుణమాఫీ చేసి రైతులకు కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తే, రుణమాఫీ అయిన రైతుల పంట రుణాలను రెన్యువల్ చేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా, యాసంగి దాటినా రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు జాప్యం చేస్తుండడం గమనార్హం. ప్రస్తుత పాలకులు బ్యాంకర్లతో ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోవడంతోపాటు వారిపై అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.