అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్. రైతన్నకు ఏం కావాలో అదే చేస్తున్నారు. పంటల సాగుకు అప్పుల తిప్పలు ఉండొద్దనే ఉద్దేశంతో 2018 సంవత్సరం నుంచి రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు పది విడుతలుగా అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించగా.. సోమవారం నుంచి పదకొండో విడుత సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. రెండోరోజు మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని 75,520 మంది రైతులకు ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున రూ.57.22 కోట్లను జమ చేయగా.. వికారాబాద్ జిల్లాలో 1.04 లక్షల మంది రైతులకు రూ.95కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పెట్టుబడి సాయం బ్యాంకుల్లో జమ అయినట్లు ఫోన్లకు వస్తున్న మెసేజ్‌లను చూసి అన్నదాతలు మురిసిపోతున్నారు. వచ్చిన డబ్బులతో విత్తనాలు, ఎరువుల కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడ్డామని.. నేడు..సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రూపాయి అప్పు లేకుండా ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్, జూన్ 27: వానకాలం పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు సాయం అందజేస్తున్నది. రెండో రోజు రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 75,520 మంది రైతుల ఖాతాల్లో రూ.57.22కోట్లు జమ అయ్యాయి. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం, రెండో రోజు ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుంటూ పంటల సాగులో నిమగ్నమయ్యారు. రంగారెడ్డిజిల్లా పరిధిలో చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 1,99,667 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.91.30 కోట్లను జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ముందస్తుగానే పెట్టుబడి సాయం
సాగు కోసం రైతులు ఇబ్బందులు పడొద్దని ముందుగానే పంటసాయం అందించారు. నాకు కూడా రైతుబంధు డబ్బు లు జమ అయ్యాయి. వాటితో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తాను. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేయ డం సంతోషకరం.
– చాకలి గోపాల్, సోలీపేట్, షాబాద్
ఎరువుల కొరత తీరింది
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో సమయానికి ఎరువులు అందక నానా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం ఎరువుల కొరత తీరింది. ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతు బంధు పైసలను ఎరువుల కోసం వినియోగిస్తాను.
– బోడ బందెప్ప, రైతు, పెద్దేముల్
రైతులను పట్టించుకుంది కేసీఆర్ సారే..
రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమాతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడు. రైతుల గోడు తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నరు కాబట్టే నేడు రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. గతంలో సావుకారి దగ్గర అప్పుతేకపోతే వ్యవసాయం నడిసేది కాదు. సీఎం కేసీఆర్ వచ్చినంక పెట్టుబడికి డబ్బులు అందుతున్నయ్..
– హరిమోహన్‌రెడ్డి, రాంపూర్
అప్పుల బాధ తప్పింది
సీఎం కేసీఆర్ రైతుల గోసను అర్థం చేసుకొని రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందు. సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు నేరుగా నా ఖాతాలో జమ అవుతున్నాయి. రైతుబంధు డబ్బులతో విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది లేదు. రైతుబంధు పైసలతో ఒకప్పుడు ఉన్న అప్పుల బాధ ఇప్పుడు తీరింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– దొరేటి హన్మంతు, రైతు, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్
రైతుబంధు వచ్చింది
వ్యవసాయ పనులు ప్రారంభంలోనే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు పెట్టుబడికి రంది లేదు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం షావుకారి దగ్గరికి పోవాల్సిన పని లేదు. నాలాంటి చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం ఎంతో భరోసాగా ఉంటున్నది.
– కృష్ణారెడ్డి, మాల్లాపూర్, కొత్తూరు మండలం
పెట్టుబడి సాయం రైతుకు మేలు
పెట్టుబడి సాయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఎరువులు, విత్తనాల కొనుగొలుకు ఉపయోగపడుతున్నది. గతంలో అప్పు తెచ్చి సాగు చేస్తే పండిన పంట అప్పుకే పోయేది. ఇప్పుడు ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేస్తున్నది.
– పి.నర్సింహులు, రైతు, రామన్నగూడ, చేవెళ్ల మండలం
పెట్టుబడి సాయం అందింది
వర్షాలు పడి దుక్కులు దున్ని పంటలు వేసే సమయానికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడికి డబ్బులు రావడం సంతోషంగా ఉంది. గతంలో పంటలు వేసే సమయానికి పెట్టుబడికి అప్పుల కోసం తిరిగేవాళ్లం. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధుతో అలాంటి అప్పులు చేయకుండా పంటలు సాగు చేస్తున్నాం.
– మురళి, రైతు, పిట్టలగూడ
అదునుకు ఆదుకున్నరు
సమయానికి అనుకున్నట్లు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేసింది. గతంలో వర్షాలు పడ్డాయంటే లాగోడికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకా రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం కింద సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున జమ అవుతున్నాయి. నాకున్న ఎకరంన్నర భూమికి రూ.7,500 వచ్చాయి.
– నక్క ఆంజనేయులు, సోలిపేట్(షాబాద్)
లాగోడికి ఇబ్బంది లేదు
రైతుబంధుతో పెట్టుబడి కోసం ఇతరుల దగ్గర అప్పు చేసే రోజులు పోయాయి. గతంలో వానకాలం మొదలైందంటేనే లాగోడికి ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు తీసుకువచ్చి పెట్టుబడిసాయం అందిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి.
– బోయిని మొగులయ్య, అంతారం, కులకచర్ల
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతులను దేవునోలే ఆదుకుంటుండు. ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగడం తప్పింది.
– బాల్‌రాజు, రైతు మర్పల్లి మండలం
వడ్డికి తెచ్చుడు తప్పింది
మా కాలంల పంట పండిద్దామంటే వడ్డికి పైసలు తెచ్చేటోళ్లం. పంట మంచిగ పండి గిట్టుబాటైతే అప్పు తీర్చేటోళ్లం. పంట పండనప్పుడు.. ధర లేనప్పుడు ఆ అప్పు అలాగే ఉండేది. కేసీఆర్ సారు సర్కారొచ్చినంక ఏ ఇబ్బంది లేదు. ఆరు నెలలకోసారి రైతుబంధు ఇస్తుండు. పెట్టుబడికి సరిపోతున్నయ్.. కేసీఆర్సారు సల్లగ బతుకాలే.
– చిలుకల రాములమ్మ, ఇబ్రహీంపట్నం
ఈ సాయం మరువలేనిది
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నది. ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ ఇలా ఇయ్యలేదు. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంకనే రైతులకు మంచి రోజులొచ్చినయ్.. రైతు ఎవరి దగ్గర అడుక్కోకుండా ప్రభుత్వమే పెట్టుబడి సాయం ఇవ్వడం సంతోషకరం. రైతులను కాపాడుకునే సీఎం కేసీఆర్ ఉండటం మా అదృష్టం.
– బోల్ల నర్సమ్మ, మహిళారైతు, తలకొండపల్లి
పెట్టుబడి కష్టం తీరినట్లే..
వానకాలం వచ్చిందంటే ఎరువులు, విత్తనాలకు ఎంతో కష్టపడేవాళ్లం. నాకు ఎకరం పొలం ఉంది. ప్రస్తుతం ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు డబ్బులు పడుతున్నయ్.. సీజన్‌కు ముందే డబ్బులు ఖాతాలో జమ కావడంతో పెట్టుబడి కష్టాలు దూరమైనట్లే.. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం.
– గణేశ్‌నాయక్, కడ్తాల్ మండలం
ఎరువులకు ఖర్చు చేస్తా..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడం హర్షణీయం. వానాకాలం, యాసంగికి కలిపి ఎకరానికి రూ.పది వేలు జమ అయితున్నయి. రైతుబంధు డబ్బులను లాగోడి రూపంలో వాడుకొంటాను. విత్తనాలు, ఎరువులను కొంటాను. రైతులను మంచిగా చూసుకొంటున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– కుమ్మరి నర్సిములు, పెద్దేముల్, పెద్దేముల్