వికారాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. తొలుత ఎకరా వరకు భూమిగల రైతులకు సోమవారం రైతుబంధు సహాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, మంగళవారం రెండు ఎకరాల రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున వానాకాలం పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. రెండెకరాల్లోపు భూమి ఉన్న 1.04 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.95 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు అప్పుల బారిన పడకుండా రైతుబంధు పథకంతో ఆర్థిక సహాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు జేజేలు పలికారు. జిల్లాలో వానాకాలం సీజన్‌కుగాను 2,88,834 మంది పట్టాదారులను రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రెండు విడతల్లో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సాయాన్ని జమ చేస్తూ రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారు.
సాగేకాలం.. రైతుకు లాభం
రైతుబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,622 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 1,94,833 మంది రైతులకుగాను రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 1,78,998 మంది రైతులకుగాను రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మంది రైతులకుగాను రూ.194 కోట్ల పెట్టుబడి సహాయాన్ని, 2020 వానాకాలం సీజన్లో 2,113,341 మంది రైతులకు రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మంది రైతులకు రూ.301 కోట్ల పెట్టుబడిని, 2021 వానాకాలం సీజన్లో 2,25,438 మంది రైతులకుగాను రూ.300 కోట్ల ఆర్థిక సహాయాన్ని, యాసంగిలో 2,24,928 మంది రైతులకుగాను రూ.241 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,47,707 మంది రైతులకుగాను రూ.305 కోట్ల రైతుబంధు సహాయాన్ని, యాసంగిలో 2,43,447 మంది రైతులకుగాను రూ.299 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
రైతు బంధు ఆదుకుంటున్నది
గతంలో వ్యవసాయానికి పెట్టుబడి లేక, వేసిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక నానా అవస్థలు పడ్డాం. బీఆర్ఎస్ సర్కార్ రైతులకు అండగా నిలుస్తున్నది. నాకున్న ఎకరంన్నరకు రూ.7,500 రైతుబంధు డబ్బులు జమ అయినయ్.. ఈ డబ్బులను సాగు కోసం మాత్రమే ఖర్చు చేస్తా.
– హనుమండ్ల సురేందర్, రాయపోల్, ఇబ్రహీంపట్నంరూరల్