రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలతో రైతులకు రుణభారం తప్పింది. గతంలో వానకాలం, యాసంగి వస్తుందంటే చాలు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. రైతులు పంట పెట్టుబడి నిమిత్తం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వడ్డీని చెల్లించలేక కొందరు రైతుల ఆస్తులను బ్యాంకు అధికారులు జప్తు చేసిన సంఘటనలు ఉన్నాయి. పంట సాగుతో వచ్చిన డబ్బులకు మించి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులుండడంతో రైతులు రుణభారంతో అష్టకష్టాలు పడేవారు. అయితే రైతుల పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన రైతుబంధు పథకంతో బ్యాంకుల నుంచి, వడ్డీ వ్యాపారుల వద్ద చేసే అప్పుల బాధలు తీరాయి. రైతుబంధు అమల్లోకి వచ్చిన గత నాలుగేండ్ల నుంచి రుణాలు మంజూరుచేసేందుకు బ్యాంకర్లు ముందుకు వస్తున్నప్పటికీ తీసుకునేందుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా పెట్టుబడి సాయం నిమిత్తం ఎకరాకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుండడంతో రైతులు బ్యాంకులవైపే చూడడంలేదని చెబుతున్నారు. గత నాలుగేండ్లుగా జిల్లాలో పంట రుణాలకు సంబంధించి వానకాలం, యాసంగి సీజన్లకుగాను నిర్దేశించిన లక్ష్యంలో 35 శాతం మాత్రమే రుణాలు మంజూరవుతున్నాయి. గతంలో ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యంలో 75 శాతం మేర రుణాలను మంజూరు చేసినప్పటికీ, అందరికీ రుణాలు అందలేదనే ఫిర్యాదులతో జిల్లా ఉన్నతాధికారులు బ్యాంకర్లపై వంద శాతం రుణాలను మంజూరు చేసేలా ఒత్తిడి తెచ్చిన పరిస్థితులుండేవి. ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు హామీనిచ్చిన దృష్ట్యా రుణాలను రెన్యువల్స్ చేసుకునే రైతులు తప్పా కొత్త రుణాలను రైతులు తీసుకోవడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలో రూ.2073 కోట్ల రుణాలను 2.18లక్షల మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా కేవలం రూ.726 కోట్ల రుణాలను మాత్రమే రైతులు పొందారు. వానకాలం సీజన్‌కు రూ.1200 కోట్లకు.. రూ.468 కోట్లు, యాసంగి సీజన్లో రూ.873 కోట్లకు.. ఇప్పటివరకు రూ.258.55 కోట్ల రుణాలను 23,847 మంది రైతులకు మాత్రమే అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధుతో రైతులకు అప్పుల తిప్పలు తప్పాయి. ప్రతి ఏటా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే పరిస్థితికి ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతు బంధు పథకం కింద గత నాలుగేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2310 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 2,30,155 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగి సీజన్లో 1,87, 804 మంది రైతులకు రూ.182 కోట్లు, 2020 వానకాలం సీజన్లో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్లు, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకు రూ.343 కోట్లు, యాసంగి సీజన్లో 345.33 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
రైతులకు పంట రుణాల మంజూరులో సహకార బ్యాంకు లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నది. సహకార బ్యాంకులు అర్హులైన రైతులందరికీ పంట రుణాలను మంజూరు చేస్తూ జిల్లా రైతాంగానికి సహకారమందిస్తున్నారు. గత మూడేండ్లుగా నిర్దేశించిన లక్ష్యానికిపైగా రైతులకు రుణాలను అందిస్తున్నారు. ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది రైతులకు పంట రుణాలను సహకార బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకే కాకుండా సంబంధిత బ్యాంకు పరిధిలోని 34 శాఖల్లోనూ ప్రతి ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి రైతులకు రుణాలనందిస్తున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్‌కు హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 34 బ్రాంచీల్లో రూ.250 కోట్లకుగాను..రూ.350 కోట్ల రుణాలను రైతులకు మంజూరు చేశారు. ఈ ఏడాదితోపాటు గత మూడేండ్లుగా 115 శాతం నుంచి 150 శాతం మేర పంట రుణాలను మంజూరు చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.218 కోట్లుకాగా రూ.320 కోట్లు, 2018-19లో రూ.272 కోట్లకు రూ.374 కోట్లు, 2019-20లో రూ.390 కోట్లకు రూ.432 కోట్లు, 2020-21లో లక్ష్యం రూ.220 కోట్లు కాగా రూ.300 కోట్ల మేర రుణాలను మంజూరు చేశారు.
– మనోహర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకుతోపాటు అన్ని శాఖల్లోనూ అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందజేస్తున్నాం. ప్రతి ఏటా అన్ని బ్రాంచీల్లో లక్ష్యానికి మించి రైతులకు రుణాలనిస్తున్నాం. యాసంగిలోనూ రైతులకు పంట రుణాలను అందిస్తాం. అర్హులైన రైతులందరికీ రుణాలు మంజూరు చేసి అండగా ఉంటాం.
మూడు, నాలుగేండ్ల నుంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. రైతులు మాత్రం రుణాల కోసం రావడంలేదు. ప్రధానంగా రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం అందుతున్న దృష్ట్యా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవాల్సిన అవసరం తప్పింది. గత నాలుగేండ్లుగా తక్కువ మొత్తంలో రైతులు పంట రుణాలు పొందుతున్నారు.