సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 20మంది సర్జన్లకు రోబోటిక్ సర్జరీలపై శిక్షణ ఇవ్వనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. దశల వారీగా కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా నలుగురు సర్జన్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ రంగ దవాఖానల్లో మొట్టమొదటి సారిగా రోబోటిక్ సర్జరీ సేవలను తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రూ.32కోట్ల వ్యయంతో ప్రస్తుతం ఉన్న రోబోలలోనే మరింత అడ్వాన్డ్స్ టెక్నాలజీతో రోబోను నిమ్స్‌లో ఏర్పాటు చేశారు.
కుట్లు ఉండదు.. నొప్పి రాదు
ఓపెన్ సర్జరీలు, ల్యాప్రోస్కోపి తదితర ప్రొసీజర్ల కంటే కూడా రోబోతో కచ్చితత్వం, కోత లేకుండా ఉండటం వల్ల కుట్లు వేయాల్సిన పనిలేదు. దీంతో పెద్దగా నొప్పి కూడా ఉండదు. రక్తస్రావం లేకుండా ఉంటుంది. దీని వల్ల రోగి త్వరగా కోలుకోవడంతో పాటు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండకుండా సర్జరీ జరిగిన రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ కావచ్చు. రోబో వల్ల ముఖ్యంగా ఇన్ఫెక్షన్ రేటు ఉండదు. సమయం, డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇంతటి సౌలభ్యం ఉన్న రోబోను నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన సర్కార్ నిరుపేద రోగులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే రోబోటిక్ సర్జరీలు చేయడం కోసం ముందుగా నిమ్స్‌లోని 20మంది సర్జన్లు శిక్షణ పొందుతున్నారు.
ఒక్కో బ్యాచ్‌కు నలుగురు
నలుగురు సర్జన్లను కలిపి ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేస్తారు. ఇందులో మొదట ఇద్దరు శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత మరో ఇద్దరికి శిక్షణ ఇస్తారు. ఈ విధంగా నలుగురు సర్జన్లు రోబోటిక్ సర్జరీలపై పరిపూర్ణంగా శిక్షణ పొంది సర్జరీలు చేస్తారని వైద్యనిపుణులు తెలిపారు.
1. వీడియో విజువల్స్ ద్వారా నేర్చుకోవడం
మొదటి దశలో సర్జన్లు రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన వీడియోలను చూసి గమనించడం, రోబో వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడంతో పాటు థియరిటికల్‌గా నేర్చుకుంటారు.
2.స్టిమ్యులేటర్ స్టేజ్
స్టిమ్యులేటర్పై ప్రాక్టీస్ చేయడం అంటే పిల్లలు వీడియో గేమ్‌ల ద్వారా కార్ రేసింగ్ వంటి ఆటలు ఆడినట్లుగానే యంత్రపై రోబోటిక్ సర్జరీలను ప్రాక్టీస్ చేస్తారు.
3. ఆన్ ఫీల్డ్ విజిట్
ఫీల్డ్ విజిట్‌లో రోబోటిక్ సర్జరీలు జరిగే థియేటర్లను సందర్శించి, అక్కడ జరిగే రోబోటిక్ సర్జరీలను లైవ్‌గా చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కత్తా, ముంబాయి తదితర ప్రాంతాల్లో ఈ బోరోటిక్ సర్జరీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నిమ్స్‌లో శిక్షణ పొందుతున్న సర్జన్లు పై రెండు దశల్లో శిక్షణ పూర్తైన తరువాత ఈ కేంద్రాల్లో ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
4. వెట్ ల్యాబ్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్
మూడు దశల్లో శిక్షణ పూర్తిచేసుకున్న సర్జన్లు వెట్ ల్యాబ్‌లో జంతువులపై ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ల్యాబ్ కేరళలోని కొచ్చిలో ఉంది. ఈ 4 దశల్లో విజయవంతంగా శిక్షణ పొందిన సర్జన్లకు వెట్ ల్యాబ్‌లో పరీక్ష ఉంటుంది. ఇక్కడ జరిగే పరీక్షలో 80శాతం కంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తేనే వారికి రోబో సర్జరీలు చేసే అర్హత ఉందని సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ పరీక్షలు ఫెయిల్ అయితే మళ్లీ వెట్ ల్యాబ్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
5. ప్రాక్టర్ సమక్షంలో ప్రాక్టీస్
ఇది అత్యంత కీలకమైన దశ. ఎందుకంటే ఈ దశలో నేరుగా రోగులపైనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోగులకు ఇక రోబోటిక్ సర్జరీ చేస్తారు. అయితే ప్రాక్టర్(రోబోలో నిష్ణాతులైన మెంటర్) సమక్షంలో సర్జరీ చేయాల్సి ఉంటుంది. మొదటి సర్జరీలో ప్రాక్టర్ 80శాతం చేస్తే శిక్షణ పొందే వైద్యుడు 20శాతం మాత్రమే సర్జరీ చేస్తాడు. రెండవ కేసులో ప్రాక్టర్ 60శాతం చేస్తే శిక్షణ పొందే వైద్యుడు 40శాతం, మూడవ కేసులో 50-50, నాల్గవ కేసులో ప్రాక్టర్ కేవలం 20శాతం చేస్తే 80శాతం సర్జరీని శిక్షణ పొందే సర్జన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన వారు రోబోటిక్ సర్జరీలకు అర్హులని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న 3నెలల తరువాత రోబోటిక్ సర్జరీలపై మళ్లీ అడ్వాన్డ్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ శిక్షణ పొందడమనేది సర్జన్ల ఇష్టం. ఈ శిక్షణలో ఒక ప్రత్యేక అవయవంపై సర్జరీ చేయడంలో అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తారు. ఉదాహరణకు కాలేయంకు సంబంధించిన స్పెషలైజేషన్ లేదా కిడ్నీకి సంబంధించిన స్పెషలైజేషన్ చేసుకోవచ్చు.
వారం పది రోజుల్లో ప్రారంభం
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా నలుగురు సర్జన్లు దాదాపుగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారం పదిరోజుల్లో రోబోటిక్ సర్జరీలను ప్రారంభిస్తాం. రోబో సేవలు అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుంది. శస్త్రచికిత్సల కోసం నిరీక్షించే సమయం కూడా తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేయగలుగుతాం. ప్రస్తుతం 20మంది సర్జన్లకు రోబో శిక్షణ ఇవ్వనున్నాం. రాబోయే రోజుల్లో వైద్య విద్యార్థులకు కూడా ఇక్కడే రోబోటిక్ సర్జరీలపై శిక్షణ కల్పించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ బీరప్ప, నిమ్స్ డైరెక్టర్