గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా గుంతలు పడిన రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారాయి. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి వర్షం నీరు నిలిచి బురదమయంగా మారాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు వర్షపు నీటితో చిన్న కుంటలను తలపిస్తుండడంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంతల రోడ్లపై అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమయానికి రోగులకు దవాఖానలకు చేర్చ లేకపోతున్నారు.
ప్రధానంగా వికారాబాద్-మోమిన్‌పేట వెళ్లే రహదారి, మోమిన్‌పేట-మర్పల్లి రోడ్డు, వికారాబాద్-కోట్‌పల్లి రోడ్డు, బొంరాస్‌పేట మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు, దౌల్తాబాద్ మండలంలోని రోడ్లు, తాండూరు-పెద్దేముల్ వెళ్లే రోడ్లు, మోమిన్‌పేట-శంకర్పల్లి వెళ్లే రోడ్లన్నీ పెద్ద, పెద్ద గుంతలు ఏర్పడడంతో ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని రోడ్లు అధ్వానంగా మారాయి. గ్రామాల్లో అయితే మరీ దారుణంగా తయారైంది.
మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కడ చూసినా బురద, గుంతలతో దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో ఓ వైపు వర్షపు నీరు నిలవడం, బురద ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గుంతల రోడ్లకు పాలకులు మరమ్మతులు చేపట్టక పోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయీ రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం గమనార్హం.