యాచారం, ఏప్రిల్ 29 : యాచారం నుంచి మేడిపల్లి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుమారు రూ. 5.5 కోట్ల పంచాయతీ నిధులతో రోడ్డు వెడల్పు చేసి బీటీ వేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం గత మార్చిలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా అదనంగా మూడు ఫీట్లు పెంచేందుకు పనులు చేపట్టారు. జేసీబీతో చదును చేసి కంకర వేసి వదిలేశారు. మార్చి నెలలో ప్రారంభించిన పని మే నెల వస్తున్నా పూర్తి కాకపోవడం గమనార్హం.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినట్లు పలువురు అంటున్నారు. యాచారం నుంచి మేడిపల్లి వరకు వాహనాల రద్దీ అధికంగా ఉండటం, పైగా రోడ్డు వన్‌వే తో ఇరుకుగా ఉండటంతో ప్రజల అభ్యర్థన మేరకు 5 కిలో మీటర్ల మేర రోడ్డును వెడల్పు చేసే పక్రియను చేపట్టారు. కానీ ప్రస్తుతం రూ.50 లక్షల నిధులతో యాచారం నుంచి ఇందన్ గ్యాస్ గోదాం వరకే రోడ్డుకు ఇరువైపులా కంకర వేసి వదిలేశారు. సుమారు మరో 4 కిలో మీటర్లకు గానూ రోడ్డు విసర్తరణ పనులను నేటికి ప్రారంభం చేయలేదు. దీంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ప్రజలు, ప్రయాణికులు మండిపడుతున్నారు. పని ప్రారంభించి రెండు నెలలు గడిచినా ఎక్కడి పనులు అక్కడే ఉండటంతో ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఈరోడ్డు అక్కడక్కడ గుంతలమయంగా మారడంతో ఆటో డ్రైవర్లు మట్టి పోసుకొని తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నారు.
బీటీ రోడ్డు వేస్తే తమ కష్టాలు తీరుతాయనున్నకున్న వాహనదారుల కల కలగానే మిగిలిపోతున్నది. పైగా ఈ రోడ్డు యాచారం నాగార్జున సాగర్ రహాదారి నుంచి గాండ్లగూడ, మల్కీజ్‌గూడ, మేడిపల్లితో పాటు అటు చరికొండ, ముద్విన్ గ్రామాల నుంచి శ్రీశైలం హైవేను కలుస్తుంది. ఇటు నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతో మీర్ఖాన్పేట మీదుగా కందుకూరుకు లింకు రోడ్డుగా ఉన్నది. మరో వైపు తక్కళ్లపల్లి మీదుగా మాల్ వైపు వెళ్తుంది. దీంతో నిత్యం వందలాది వాహనాలతో ఎంతో రద్ధీగా ఉండే ఈ రోడ్డు పనులు నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. రోడ్డు తవ్వి కంకర వేయడంతో నరకం చవిచూస్తున్నామని, వాహనాలు నడిపేందుకు కష్టాలు రెట్టింపయ్యాయని వాపోతున్నారు. అప్పుడప్పుడు ముఖ్యంగా రాత్రిపూట బైకులు అదపుతప్పి కింద పడి గాయాలపాలవుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు అలాగే ఉన్న బాగుండేదని, వెడల్పు పేరుతో తవ్వి కంకర వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతన్నారు.
రోడ్డు పనులను వేగవంతం చేయాలి: పొద్దుటూరి రవీందర్
యాచారం-మేడిపల్లి రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్లు వెంటనే నిర్లక్ష్యం వీడాలి. ముందుగా యాచారం నుంచి 5కిలో మీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా మూడు ఫీట్ల వెడల్పను విస్తరించాలి.అనంతరం బీటి రోడ్డు వేయాలి. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం. రోడ్డు పనులు నిలిచి పోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి నాన్యతతో కూడిన రోడ్డును వేయించాలి. రోడ్డు పనులను వేగవంతం చేయకపోతే ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేసేందుకు సిద్దంగా ఉన్నారు. రోడ్డు నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే తగిన చొరవ తీసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేయాలి. పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు.