రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సీఎం ఇలాకా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని పలు వంతెనలు, గ్రామాలకు వెళ్లే రహదారులు తెగిపోవడంతో ప్రయాణించేందుకు చాలా కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురువడంతో ఈ పరిస్థితి దాపురించింది.
రోడ్లపై వేసిన మట్టి కొట్టుకుపోయి, బీటలు
వారడంతో నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రాంతాల్లోని కల్వర్టు నిర్మాణం పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయన్నారు. సింగిల్ రోడ్డుపై వేసిన బీటీ రోడ్డును తొలగించకుండానే దానిపైనే మట్టి వేసి డబుల్ రోడ్డు పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు, అధికారులెవరు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొడంగల్/బొంరాస్‌పేట, జూలై 23 : నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని గ్రామాలు, తండాల్లో కొనసాగుతున్న రోడ్ల పనులు వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి నడిచేందుకు వీలు లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్‌పేట మండల పరిధిలోని మూడుమామిళ్ళతండా గ్రామపంచాయతీ నుంచి బండమీదితండా వరకు, బాపన్చెరువుతండా పంచాయతీ నుంచి మేరుగనుబావితండా వరకు, రేగడిమైలారం నుంచి దీప్లానాయక్తండా వరకు, మదన్‌పల్లితండా నుంచి పరిగి మండలం ఇబ్రహీంపూర్తండా వరకు ప్రభుత్వం కొత్తగా బీటీ రోడ్లను మంజూరు చేసింది.
కొడంగల్ మండల పరిధిలో గుండ్లకుంట, పెద్దనందిగామ, చిట్లపల్లి, అంగడిరైచూర్ తదితర గ్రామాలు, తండాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాగా అధికారుల పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు కురువడంతో గ్రామాలకు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు రైతులు, ప్రజలు పేర్కొంటున్నారు.
కల్వర్టుల వద్ద పనులు అసంపూర్తిగా ఉండడం., రోడ్లపై మట్టి వేసి నెలలు గడుస్తున్నా బీటీ పనులు పూర్తిచేయకపోవడం., వర్షాలకు మట్టి బురదగా మారడంతో కళాశాలలు, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంట్రాక్టర్లు, అధికారులపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాపన్చెరువుతండాకు వెళ్లే రోడ్డు మార్గం చెరువుకట్టపై నుంచి వెళుతున్నది. కాగా.. భారీ వర్షాలతో కట్టపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. బొంరాస్‌పేట నుంచి మదన్‌పల్లి మీదుగా నాగారం వరకు మంజూరైన రెండు వరుసల రహదారి పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇంకా కల్వర్టుల పనుల వద్దే ఉన్నాయి.
మదన్‌పల్లి చెరువు వద్ద సదరు కాంట్రాక్టర్ కల్వర్టు పనులు ప్రారంభించి పూర్తిచేయకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డుపై వర్షం నీరు రావడంతో బురద ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మదన్‌పల్లితండా నుంచి పరిగి మండలం ఇబ్రహీంపూర్తండా వరకు ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.కోటితో నూతనంగా మంజూరైన బీటీ రోడ్డు పనులు దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా పూర్తికాలేదు. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో వరద ఎక్కువగా వచ్చి రోడ్డుకు మధ్యలో ఉన్న కల్వర్టు వద్ద రెండు వైపులా వేసిన కంకర కొట్టుకుపోయింది. దీంతో తండావాసులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు ధ్వంసమైన రోడ్లకు సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.