అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు చిన్నగా ఉండి మూలమలుపులు అధికంగా ఉండడంతో వారంలో దాదాపుగా రెండు వరకు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏడాదిన్నర క్రితమే టెండర్ల ప్రక్రియ పూర్తై నా.. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో ఆ దారిలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు జంకుతున్నారు.
– చేవెళ్ల రూరల్, డిసెంబర్ 3
డేంజర్ మలుపులు..
హైదరాబాద్-బీజాపూర్ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. అసలే అది చిన్న రోడ్డు.. అందులో మూలమలుపులు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుమీదుగా రంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతోపాటు పక్క రాష్ట్రంలోని కర్ణాటకకు కూడా అనేక బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. హెవీ వెహికిల్స్ వెళ్లడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని గతుకులమయంగా మారింది.
ముందుకు సాగని పనులు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ రోడ్డు విస్తరణ కోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. సీఎం, స్పీకర్ ఇద్దరూ వికారాబాద్ జిల్లాకు చెందిన వారే ఉన్నా .. పనులు ప్రారంభం అయ్యేందుకు చొరవ చూపకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పందించి రోడ్డు పనులను త్వరగా ప్రారంభించి రోడ్డు ప్రమాదాల నుంచి తమను కాపాడాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్లే దారి..
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్లాలి. ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నా సీఎం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత సెగ్మెంట్‌కు వెళ్లే రోడ్డును బాగుచేయలేని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రజలు, బాధితులు ప్రశ్నిస్తున్నారు.
24 గంటలు గడవక ముందే..
ఈనెల 1వ తేదీ (ఆదివారం) శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరుకు చెందిన మేకల లక్ష్మారెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ గేట్ సమీపంలో కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే సోమవారం మరో రెండు భారీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆలూర్ గేట్ సమీపంలో కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన 2 గంటల్లోనే చేవెళ్ల మండలంలోని అంతారం గేట్ సమీపంలో ఎదురెదురుగా స్కూటీ డీసీఎం వ్యాన్ ఢీ కొన్న ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు.
విరిగిపోయిన ప్లాస్టిక్ రోడ్డు డివైడర్లు..
మూల మలుపుల వద్ద ప్లాస్టిక్ రోడ్డు డివైడర్లు పూర్తిగా విరిగిపోవడంతో అతివేగంతో వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్ స్పాట్లలో డివైడర్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ప్లాస్టిక్ రోడ్డు డివైడర్లు పూర్తిగా విరిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాటిని తిరిగి ఏర్పాటు చేస్తే బాగుం టుందని పలువురు పేర్కొంటున్నారు.
మన ప్రాణాల కన్నా చెట్లు ముఖ్యం కాదు..
చేవెళ్ల టౌన్, డిసెంబర్ 3 : హైదరాబాద్-బీజాపూర్ రహదారిలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవా రం చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్, అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? అని మండిపడ్డారు. మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ముఖ్యం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు విస్తరణ పనులను చేపట్టి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏ గేటు వద్ద ఉన్న చెట్లను ఆ గ్రామానికి చెందిన వారే నరికి వేస్తారని.. అధికారులు ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు.
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలి..
షాబాద్ : బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని లేకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలకు నిరసన గా మంగళవారం చేవెళ్ల మండలంలోని ఆలూర్ గ్రామస్తులు, అఖిలపక్ష నాయకుల తో కలిసి ఆయన ఆలూర్ గేట్ నుంచి చేవెళ్ల వరకు పాదయాత్రగా వెళ్తున్న క్రమంలో మీర్జాగూడ సమీపంలో చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, ఏసీపీ కిషన్ తదితరులు కలిసి వారిని ఆపి చర్చించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.7 లక్షలు, గాయపడ్డ వారికి ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులు భరించి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శుభప్రద్‌పటేల్ మా ట్లాడుతూ..బీజాపూర్-హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు తక్షణమే ప్రారంభించా లన్నారు. ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)గతేడాదే ఇచ్చిన ఆదేశాలను ఈ ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడంతోనే రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగక.. ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమం లో అఖిలపక్ష నాయకులు, గ్రామాల ప్రజలు తదితరులున్నారు.