వికారాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ): జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. వరుసగా ఏదో ఓ చోట పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నది. బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్రాయం పేద ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నది. అయితే క్వాలిటీలేని సన్నబియ్యం పంపిణీతో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనే ప్రచారం జరుగుతున్నది. రేషన్ దుకాణాల ద్వారా తీసుకున్న సన్న బియ్యాన్ని మొదట ఒకటి రెండు నెలలు తిన్న ప్రజలు ఆ తర్వాత క్వాలిటీ లేకుండా తినలేని విధంగా ఉండడంతో బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం నాణ్యత లేకపోవడంతో తిరిగి బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, సీఎంఆర్ రైస్ అందజేయాల్సిన రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేస్తూ రీసైకిల్‌కు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న మూడు నెలల రేషన్ బియ్యానికి సంబంధించి కూడా మొదట వారం రోజులు జిల్లాలో పంపిణీ చేసిన బియ్యం కొంత పర్వాలేదనిపించినా, తర్వాత పంపిణీ చేస్తున్న బియ్యం చాలా నాసిరకంగా ఉన్నట్లు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో గతేడాదిలో 582 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అత్యధికంగా జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో 261 మెట్రిక్ టన్నులు, కొడంగల్ నియోజకవర్గంలో 167 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం, పరిగి నియోజకవర్గంలో 86 మెట్రిక్ టన్నులు, వికారాబాద్ నియోజకవర్గంలో 68 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పీడీఎస్ బియ్యం పట్టుపడుతుండటం పరిశీలిస్తే జిల్లాలో ఏ స్థాయిలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి తీసుకువచ్చిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలంటే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పితే సంబంధిత ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ బియ్యం రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి జిల్లాలో పండించే సన్నబియ్యం ఒక నెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కూడా సరిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి అయితే జిల్లాకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతున్నది. అయితే ఏయే జిల్లాల నుంచి జిల్లాలోని రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు సన్నబియ్యాన్ని సిద్ధం చేసే ముందు జిల్లా పౌరసరఫరాల అధికారులు జిల్లాలోని మెజార్టీ రేషన్ దుకాణాల్లోనూ సన్నబియ్యం క్వాలిటీ లేకపోవడంతో ప్రజలు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ప్రభుత్వం సరఫరా చేస్తే మేం పంపిణీ చేస్తున్నామని, వాస్తవానికి క్వాలిటీలేని సన్నబియ్యం వస్తోందని, జిల్లాలోని పలువురు రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 5780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 2,48,475 ఉండగా, 8,87,912 మంది లబ్ధిదారులున్నారు. అయితే వీటిలో అంత్యోదయ కార్డులకు సంబంధించి 26,621 కార్డులకుగాను 79,524 మంది లబ్ధిదారులు, అన్నపూర్ణ కార్డులకు సంబంధించి 41 మంది సభ్యులు, ఆహార భద్రత కార్డులకు సంబంధించి 2,21,818 కార్డులు ఉండగా, 8,08,347 మంది లబ్ధిదారులున్నారు.