జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. పలు మండలాల రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరిట మార్చుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూములపై అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై బోగస్ డాక్యుమెంట్లు, మ్యుటేషన్లు, సక్సేషన్లు, జీపీఏలు చేసుకుంటూ నిజమైన రైతులను ఆగం చేస్తున్నారు. భూ కబ్జాదారులు రెవెన్యూ అధికారులతో కలిసి ధరణి పోర్టల్‌లో పట్టాదారు పేర్లు మార్చుతూ.. కబ్జా కోసం కోర్టుకెళ్తూ.. బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో ఇటీవల పూడూరు, మోమిన్‌పేట మండలాల్లో జీపీఏలకు సం బంధించి పట్టాదారులకు ఎలాంటి సమాచా రం ఇవ్వకుండానే ఇతరుల పేరిట భూమార్పిడి చేయగా.. ఈ విషయం జిల్లాలో చర్చానీయాంశంగా మారిం ది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. సంబంధిత పూడూరు డీటీపై కలెక్టర్ ప్రతీక్ జైన్ వేటు వేశారు .
-వికారాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని పూడూరు మండలంలో రూ. పది కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు అక్రమార్కులు రెవె న్యూ అధికారితో కుమ్మక్కయ్యారు. గుట్టుచప్పు డు కాకుండా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా థర్డ్ పార్టీకి జీపీఏ అప్రూవల్ చేసి 10 ఎకరాల 22 గుంటల భూమిని డిప్యూటీ తహసీల్దార్ ఇతరుల పేరిట మార్చేశాడు. ఈ వ్యవహారంపై జిల్లాలో జోరు గా చర్చ జరుగుతున్నది. పూడూరు మండలంలోని చన్గోముల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 496 లోని 10 ఎకరాల 22 గుంటల భూమి గఫార్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, ఇస్మాయిల్, మల్గ అంజయ్య, మల్గ బుచ్చమ్మ, మల్గ మల్లేశం పేరిట రికార్డుల్లో ఉండడంతోపాటు కబ్జాలోనూ వారున్నారు.
అయితే వారందరూ 2009లో విఠల్‌గౌడ్, మహ్మద్ బాసిత్, శ్యామ్, సీఎల్ఎన్ ప్రసాద్ పేరిట జీపీఏ చేశారు. అయితే ఈ నెల 4, 6, 7 తేదీల్లో జీపీఏ చేసుకున్న పై నలుగురు వ్యక్తులు పట్టాదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గగన్రెడ్డి పేరిట 10 ఎకరాల 22 గుంటల భూమిని జీపీఏ అప్రూవల్ చేయగా డిప్యూటీ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశాడు. కాగా ఈ నెల 10న రుణం తీసుకునేందుకు బ్యాంకుకెళ్లిన బాధిత రైతుకు ఆన్లైన్లో గగన్రెడ్డి పేరు కనిపించడంతో ఖంగుతిన్నాడు. ఈ విషయం మిగతా రైతులకు తెలిపి తహసీల్దార్ కార్యాలయానికెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరిగి సంబంధిత రైతుల పేరిట 10 ఎకరాల 22 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి అధికారులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కాగా భూమి తన పేరిట నుంచి తిరిగి రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంతో గగన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ భూమిని కాజేసేందుకు ప్లాన్ చేయడంతోపాటు తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టాదారులు కలెక్టర్‌తోపాటు ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
తహసీల్దార్ సెలవులో ఉండడంతో ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పెద్ద ఎత్తున డబ్బు లు తీసుకొని ఈ అక్రమాలకు పాల్పడినట్లు రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. మరోవైపు మోమిన్‌పేట మండల కేంద్రంలోనూ ఇలాంటి అక్ర మ రిజిస్ట్రేషనే జరిగింది. పట్టాదారులకు తెలియకుండానే ఎకరంన్నర భూమిని గతంలో జీపీఏ చేసుకున్న వ్యక్తి పేరిట మోమిన్‌పేట తహసీల్దార్ అప్రూవల్ చేశా డు. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అసిస్టెంట్ కలెక్టర్ విచారణ చేపట్టారు.
పూడూరు డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు
పూడూరు : రైతులకు తెలియకుండా ఇతరుల పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేసిన పూడూరు డిప్యూటీ తహసీల్దార్ కిశోర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చన్గోముల్ గ్రామంలోని సర్వేనంబర్ 496లో ఉన్న పది ఎకరాల 22 గుంటల భూమిని గత నెల మొదటి వారంలో గగన్రెడ్డి పేరిట డిప్యూటీ తహసీల్దార్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు గురువారం పలు దిన పత్రికల్లో ఈ భూకబ్జాపై కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన పూడూరు డిప్యూటీ తహసీల్దార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ గురువారం సాయంత్రం పూడూరు తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.