జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, సీలిం గ్, అన్యాక్రాంతమైన భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు అధికారు లు చర్యలు తీసుకుంటున్నా పలు కారణాలతో తరచూ ఆలస్యమవుతున్నది. జిల్లాలోని ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. కాస్రా, పహాణీలు, సేత్వార్లో ప్రభుత్వ భూములను పైరవీకారులు, కొందరు రియల్టర్లు అక్రమ మార్గం లో పట్టాలుగా తమ పేరున మార్చుకుని.. ఇప్పటికే ఆ భూములపై లావాదేవీలూ జరిపారు. ప్రభుత్వం మళ్లీ కాస్రా, పహాణీలు, సేత్వార్లను ప్రమాణికంగా తీసుకుని ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నది. లావాదేవీలు జరిగిన ప్రభుత్వ భూములను బయటికి తీస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రక్రియను ముందుకు సాగనివ్వడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆ జాబితా తయారీకి అడ్డంకులు ఎదురవుతున్నట్లు సమాచారం.
రంగారెడ్డి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, వక్ఫ్, దేవాదాయ భూములు అక్రమ మార్గంలో పట్టాలుగా మారాయి. సేత్వార్, కాస్రా పహాణీల్లో మాత్రం ఆ భూములన్నీ ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ భూములుగానే చూపుతుండడంతో వాటిని మళ్లీ ప్రభుత్వ భూ ముల కిందనే పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియకు కొం దరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అడ్డు తగులుతున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని గండిపేట, బాలాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ వంటి మండలాల్లో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములను అక్రమ మార్గంలో కొంద రు రాజకీయ నాయకులు, రియల్ఎస్టేట్వ్యాపారులు పట్టాలుగా మార్పిడి చేసి.. ఆ భూములపై లావాదేవీలు కూడా జరిపారు. కాగా ఈ భూములపై పారదర్శకంగా విచారణ జరిగితే రూ. వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కే అవకాశాలున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం, పోల్కంపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 29లో 48 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ఆ గ్రామానికి చెందిన కొందరికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలిచ్చింది. 1954 పహాణీ ప్రకారం ఆ భూమి నేటికీ ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉన్నది. అయితే కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ భూమిని పట్టాగా మార్పిడి చేసి క్రయవిక్రయాలు జరిపారు. రికార్డుల ప్రకారం నేటికీ ఈ భూములు ప్రభుత్వ భూములుగానే ఉన్నా.. ఈ భూములపై లావాదేవీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చినా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో యథావిధిగా ఈ భూముల్లో చేసిన ప్లాట్లపై క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అలాగే, బాలాపూర్ మండలంలోని నాదర్గుల్, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తుర్కయాంజాల్, కందుకూరు మండలంలోని కందుకూరు, గండిపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ, దేవాదాయ భూములుగా ఉన్నా తప్పుడు రికార్డుల ఆధారంగా నేటికీ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ భూములను పారదర్శకంగా బయటికి తీస్తే ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరనున్నది.
ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున బేరసారాలకు తెరలేపారు. ఇప్పటికే క్రయవిక్రయాలు జరిపిన భూములు ప్రభుత్వ భూములని ఆయా రియల్ఎస్టేట్ సంస్థలకు సమాచారమిస్తుండడంతో వారు ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చవద్దంటూ పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో రాజకీయ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను దారి మళ్లీస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా గుట్టుచప్పుడు కా కుండా ప్రభుత్వ భూముల సర్వేనంబర్లను మినహాయిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరపాలని ప్రజలు కోరుతున్నారు.