దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించి గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కేటాయించిన ప్రత్యేక నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. దీంతో రాష్ట్రంలోని ఏ గ్రామానికెళ్లినా పచ్చని పల్లె ప్రకృతివనాలు, ఊరికో ట్రాక్టర్, రోడ్లు అద్దంలా మెరిశాయి. అయితే, 14 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలపై దృష్టి సారించడంలేదు. వాటికి నిధులను నిలిపేసింది. దీంతో నిధుల్లేక, నిర్వహణ పట్టించుకునే నాథుడు లేక పల్లెప్రగతి కార్యక్రమం నీరుగారిపోతున్నది. గతంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెప్రకృతివనాలు నేడు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
షాబాద్, ఫిబ్రవరి 23 : గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. గ్రామాల ప్ర గతి కోసం ప్రతినెలా నిధులను కేటాయించింది. వాటితో హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్‌యార్డులు, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, రైతువేదికలు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు, వాటర్‌ట్యాంకర్లు, వైకుంఠధామాలను అధికారులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ హ యాంలో రంగారెడ్డి జిల్లాలోని ఏ గ్రామానికెళ్లినా పచ్చ ని పల్లె ప్రకృతివనాలు, ఊరికో ట్రాక్టర్, చెత్త సెగ్రిగేషన్ షెడ్లు, రోడ్లు అద్దంలా కనిపించాయి.
అప్పట్లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రా ష్ర్టాల్లోని గ్రామ పంచాయతీలను పరిశీలించి అవార్డులను ప్రకటి స్తే.. అందులో అత్యధికంగా తెలంగాణ పల్లెలనే వరించేవి. అందులో అత్యధికంగా మన జిల్లాకే దక్కేవి. గ్రామాలంటే తెలంగాణలో ఉన్న ట్లు ఉండాలని.. అద్భుతమైన పల్లెపాలనకు కేసీఆర్ సర్కారు నిదర్శనమటూ యావత్ దేశం కీర్తించింది. అయితే.. ప్రభుత్వం మారి కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మా రిపోయింది. గ్రామ పంచాయతీలకు వచ్చే నెలవారీ నిధులూ నిలిచిపోయాయి. దీంతో నిధుల్లేక, నిర్వహణ పట్టించుకునే నాథుడు లేక పల్లెప్రగతి కార్యక్రమం నీరుగారిపోతున్నది. గతంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెప్రకృతివనాలు నేడు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. కిస్తీలు కట్టలేక గ్రామ పం చాయతీల్లోని ట్రాక్టర్లు మూలనపడ్డాయి.
పంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 531 గ్రామ పంచాయతీలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ‘పల్లెప్రగతి’లో చేపట్టిన పల్లెప్రకృతివనాల్లో నాటిన మొక్కలకు నీరులేక ఎండిపోతున్నాయి. తెలంగాణ క్రీడాప్రాంగణాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అందులో అమర్చిన పరికరాలు తుప్పుపట్టి పాడవుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో గత ప్రభుత్వం జీపీలకు అందించిన ట్రాక్టర్లకు కిస్తీలు చెల్లించలేక మూలనపడ్డాయి. పారిశుధ్య నిర్వహణలో భాగంగా గతంలో పల్లెల్లో ఇంటింటికీ పంపిణీ చేసిన చెత్త డబ్బాలు పాడైపోగా, కొత్తవి కొనలేని దుస్థితి నెలకొన్నది. తడి, పొడి చెత్తను వేరు చేసే
సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ లేకుండా పోయింది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నీరులేక ఎండిపోతున్నాయి. పల్లెలన్నీ సమస్యల వలయంలో సతమతమవుతున్నాయి.
గ్రామాల్లో గతేడాది నుంచి ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్నది. ఒక్కో అధికారికి మూడు నుంచి నాలుగు గ్రామాలను అప్పగించడంతో పనిభారం ఎక్కువైంది. మరో వైపు మండల పరిషత్‌లకు జిల్లా అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించడంతో గ్రామ, మండల స్థాయిలో ఇబ్బందులు తప్ప డం లేదు. పారిశుధ్య నిర్వహ ణ, తాగునీటి సరఫరా, ట్రాక్టర్లు, ట్యాంకర్ల మెయింటెనెన్స్, తాగునీటి పైపులైన్ లీకేజీలు, వీధి దీపాలకు మరమ్మతులు తదితర పనులకు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది.
నిధుల కొరతతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వడం కష్టంగా మారింది. కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో తాము విధులకు రాలేమని వారు చెబుతుండడంతో ఆయా గ్రామాల్లోని తాజా, మాజీ సర్పంచులు మీకు వేతనాలు చెల్లిస్తామని ఒప్పుకొని వారితో పనులు చేయిస్తున్నా రు. ఓ వైపు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడం, మరోవైపు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండడంతో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.