కేంద్రంపై వరి పోరుకు గులాబీ దండు సన్నద్ధమవుతున్నది. పంజాబ్ తరహాలో తెలంగాణలో రెండు సీజన్ల ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. పార్టీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు కేంద్రంపై సమరానికి సమాయత్తమవుతున్నారు. గురువారం అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తీర్మానాలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 2నుంచి కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి పార్టీ శ్రేణులు సంసిద్ధమవుతున్నాయి.
పరిగి/ఇబ్రహీంపట్నం, మార్చి 23 : పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రెండు పంటలకు సంబంధించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనలకు సిద్ధమైంది. రైతుల పక్షాన నిలబడి కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమవుతున్నది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతుల తరఫున ఉద్యమానికి ఏర్పాట్లు చేపట్టింది. ఇందులోభాగంగా గురువారం ఉమ్మడిజిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యానికి సంబంధించి ప్రతి సంవత్సరం ముడి బియ్యంతోపాటు బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐ వారు కొనుగోలు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ముడి బియ్యమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కిరికిరికి దిగింది. యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని నేరుగా బియ్యం చేస్తే విరిగిపోతాయి. బాయిల్డ్ రైస్‌గా చేయడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం పేచీలు పెడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నది. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో కేంద్రంపై రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరుకు సిద్ధమైంది.
గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలస్థాయిలో జరిగే సన్నాహక సమావేశాల్లో స్థానిక సంస్థల నుంచి మొదలుకొని అన్ని స్థాయిల్లో సమావేశాలు జరిపి చేయాల్సిన తీర్మానాలపై అవగాహన కల్పిస్తారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో రైతుల పక్షాన పోరు చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ దిశా నిర్దేశం చేసింది. యాసంగి వడ్ల కొనుగోలు డిమాండ్‌తో కేంద్ర మంత్రిని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంలోని మంత్రులు, ఎంపీలు కలువనున్నారు. కేంద్రం స్పందనను బట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతున్నది. ముందుగా ఈ నెల 26న గ్రామపంచాయతీ, 27న మండల పరిషత్తు, 30న జిల్లా పరిషత్ పాలకవర్గాలు ధాన్యం కొనుగోళ్లపై తీర్మానాలు చేయనున్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అలాగే పీఏసీఎస్, మార్కెట్ కమిటీలు, డీసీఎంస్లలో కూడా తీర్మానాలు చేసి పంపిస్తారు. వన్ నేషన్, వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. అయినప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. కేంద్రం వడ్లు కొనుగోలు చేసేంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కొనసాగించనున్నది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిధాన్యం పండుతున్నది. అలాగే, 24గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలోని రైతులను, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రజలు, రైతులు తమ ఉద్యమ ప్రతిభను చాటేందుకు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొహం చాటేస్తూ అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నది. ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు, రైతులు ముందుకు రావాలి. నేడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున హాజరు కావాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు తీర్మానాల అనంతరం ఏప్రిల్ 2నుంచి కేంద్రంపై పోరాటం మరింత ఉధృతం చేయనున్నందున ప్రతిఒక్కరూ సిద్ధం కావాలి.
– మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ రెండు పంటలకు సంబంధించి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇందులోభాగంగా గురువారం జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నాం. అనంతరం గ్రామపంచాయతీస్థాయి నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ వరకు సమావేశాలు నిర్వహించి కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. అనంతరం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.