కొత్తూరు, మే 24 : డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం సిద్ధాపూర్ దద్దరిల్లింది. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు. మండలానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని భావించి పచ్చని పంట
పొలాలను ప్రభుత్వానికి ఇచ్చామని..
తీరా చూస్తూ సేకరించిన భూమిని చెత్త డంపింగ్‌కు వినియోగించాలని సర్కార్ యత్నించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డు సిద్ధాపూర్‌కు వస్తే పరిసర గ్రామాల ప్రజలు, పాడి పశువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చెత్త డంపింగ్‌తో వాతావరణంతోపాటు నీటి కాలుష్యం ఏర్పడుతుందని.. ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.
సంబంధిత మంత్రి, సీఎం జోక్యం చేసుకొని చెత్త డంపింగ్ యార్డు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, పెంజర్ల సర్పంచ్ జగన్, వైఎంతండా సర్పంచ్ గోవింద్‌నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ కొత్తూరు మండలాధక్షుడు, బాబూరాజ్నాయక్, మాజీ సర్పంచ్ ప్రభాకర్, ఆయా గ్రామా ల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.