ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 20 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధూంధాంలతో ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్ గ్రామాల్లో ధూంధాం లను నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించటంతోపాటు ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు..కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
గురువారం రాత్రి యాచారం మండలంలోని మేడిపల్లిలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ప్ర జలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్‌గా ఆయన మేడిపల్లి గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ.. మేడిపల్లిలో ధూంధాంను నిర్వహించగా మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు హారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ధూంధాం కళాకారుల పాటలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆటల్లో పాల్గొన్నారు. ప్రతిరోజూ ఓ మేజర్ గ్రామం చొప్పున కార్యక్రమాన్ని నిర్వహించాలని షెడ్యూల్ ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో మేజర్ గ్రామాలను ఇప్పటికే గుర్తించి కార్యక్రమ షెడ్యూల్‌ను రూపొందించారు. అలాగే, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కేంద్రాల్లో నూ ధూంధాం కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలా గే, చిన్న గ్రామాల్లో రోడ్‌షోల ద్వారా ప్రచారాలను నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచారు. ముందుగా ఆయ న యాచారం మండలంలోని నందివనపర్తిలోని నందీశ్వరాలయంలో పూజలుచేసి ప్రచారాన్ని ప్రారంభించా రు. ఇప్పటికే ఆయన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాలు, అలాగే, ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల సమావేశాలూ నిర్వహించారు. రోడ్‌షోలు, ధూంధాంలతో ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.