యాచారం, ఆగస్టు1: ఫార్మా బాధిత రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్త కవుల సరస్వతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఫార్మా బాధిత రైతులతో కలిసి ఆమెకు వినతిపత్రంను అందజేశారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, ఫార్మా భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రైతులను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందన్నారు.
రైతుల నుంచి భూములు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినప్పటికి, అధికారులు కోర్టు ఆర్డర్‌ను దిక్కరిస్తూ భూములకు సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాసిటీకి ఇవ్వని 2500ల ఎకరాల భూములకు సంబంధించి కోర్టులో స్టే ఉండగానే ప్రభుత్వం పోలీసుల పహరా నడుమ సర్వే చేస్తూ రైతులను అధికారులు భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఫార్మాసిటీకి భూములిచ్చేదిలేదని ఆమె తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీ జీఓను అధికారికంగా పూర్తిగా రద్దు చేసి, రైతుల భూములకు అన్ని హక్కులు కల్పించి, రైతుల భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధంగా ఇక్కడ కూడా భూ సేకరణను రద్దు చేయాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫార్మా బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మీనాక్షి నటరాజన్‌ను కోరారు. రైతులకు న్యాయం జరిగేవరకు ఫార్మా వ్యతిరేఖ పోరాట కమిటి ఆధ్వర్యంలో పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటి సభ్యులు కానమోని గణేష్, కుందారపు నారాయణ, రైతులు, తదితరులన్నారు.