వికారాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లా రైతుల్లో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ టెన్షన్ మొదలైంది. జిల్లా కేంద్రం సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుండడంతో ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. మరోవైపు భూములు కోల్పోతున్న రైతు ల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్నది. సన్న, చిన్నకారు రైతులకు ఒకటి, రెండు ఎకరాలు మాత్రమే ఉంటుంది.
ఈ రోడ్డులో ఆ భూములను కోల్పోతే మేమె లా బతకాలనే బాధపడుతున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ట్రిపుల్ఆర్ కొత్త అలైన్మెంట్ ప్రకారం జిల్లాలోని పూడూరు, వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట మండలాల మీదు గా వెళ్లనున్నది. కొత్త అలైన్మెంట్ పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు ఎకరా రూ. కోట్లలో ఉన్నది. ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోతే ప్రభుత్వం అందజేసే అరకొర సాయంతో నష్టపోవాల్సి వస్తుందేమోననే టెన్షన్ సంబంధిత గ్రామాల రైతుల్లో నెలకొన్నది.
రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదించిన కొత్త అలైన్‌మెంట్‌ను చాలావరకు పట్టా భూముల మీదుగా రూపొందించారు. ఈ విషయమై భూములు కోల్పోతున్న రైతు లు జిల్లా ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులతోపాటు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కొందరు రైతులకు ఉన్న అర, ఒకటి, రెండు ఎకరాల భూమి మొత్తం రీజినల్ రింగ్ రోడ్డులో పో తుండడంతో మా భూములిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఇప్పటికే ట్రిపుల్ఆర్ కొత్త అలైన్మెంట్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌నూ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని నాలుగు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా సర్వే నంబర్లతో ప్రకటించారు. మోమిన్‌పేట మండలంలోని దేవరంపల్లికి చెందిన రైతులతోపాటు నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామ రైతులు పట్టా భూములను కోల్పోవాల్పి వస్తుంది. ప్రభుత్వం అసైన్డ్ భూ ముల మీదుగా ప్రతిపాదనలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా.. ఏమైనా మార్పులు.. చేర్పులు చేస్తారా? లేక ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారం ముందుకెళ్తారా అనేది త్వరలో స్పష్టత రానున్నది.
కొత్త అలైన్మెంట్ ప్రకారం జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరం నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్లనున్నది. పాత అలైన్మెంట్ ప్రకారం జిల్లా సరిహద్దు మీదుగా వెళ్లిన ట్రిపుల్ ఆర్, కొత్త అలైన్మెంట్తో జిల్లా పరిధిలోని 5 కిలోమీటర్ల లోపలికి మార్చా రు. పాత అలైన్మెంట్ ప్రకారం జిల్లాలోని ఒకటి, రెండు గ్రామాల మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ రూపొందించారు. కొత్తగా ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారం జిల్లాలోని 50 గ్రా మాలకుపైగా రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలోకి రానుంది.
పూడూ రు మండలంలోని గొంగుపల్లి, గట్పల్లి, కెరెళ్లి, మంచన్‌పల్లి, మన్నెగూడ, పెద్దఉ మ్మెంతాల్, పూడూరు, రాకంచర్ల, సిరిగాయపల్లి, తుర్కఎన్కెపల్లి, ఎన్కెపల్లి గ్రామాలున్నాయి. వికారాబాద్ మండలం లోని బూరాన్పల్లి, పాతూర్, పీరంపల్లి, పులుసుమామిడి గ్రామాల మీదుగా నవాబుపేట మండలంలోని చించల్పేట్, చిట్టిగిద్ద, దాతాపూర్, యావాపూర్.. మోమిన్‌పేట మండలంలోని దేవరాంపల్లి, టేకులపల్లి గ్రామాల మీదుగా కొత్త అలైన్‌మెంట్‌ను మార్చారు.
పాత అలైన్మెంట్ ప్రకారం జిల్లాలోని పూడూరు మం డలంలోని అంగడిచిట్టంపల్లి గ్రామ పంచాయతీ సరిహద్దు ప్రాంతం, నవాబుపేట మండలంలోని పూలపల్లి సరిహద్దు మీదుగా వెళ్లింది. అలైన్మెంట్ మారడంతో వికారాబాద్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల చేరవకు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మారుస్తూ ప్రభు త్వం ప్రతిపాదించింది. కొత్త అలైన్మెంట్ మార్పుతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. భూములు కోల్పోతున్న రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్నది. రీజినల్ రింగ్‌రోడ్డులో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ల్యాండ్ పూలింగ్ కింద పరిహారంగా స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రూ.కోట్ల విలువ చేసే భూములు కోల్పోయి గజాల్లో ప్రభుత్వం ఇచ్చే స్థలాలను తీసుకునేందుకు ఒప్పుకునేది లేదనే అభిప్రాయం సంబంధిత గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.
కేశంపేట : ట్రిపుల్ రోడ్డు పనులను వెంటనే నిలిపేయాలని మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామస్తులు కేశంపేట తహసీల్దార్ ఆజంఅలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గతంలో కొత్తపేట-కేశంపేట, సుందరాపురం-బొదునంపల్లి, కాకునూరు గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వేస్తామని ప్రకటించారని.. నేడు తొమ్మిదిరేకుల వ్యవసాయ పొలాల మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్వేనంబర్లను ఎంపిక చేయడం సరికాదన్నారు.
గ్రామంలో మొత్తం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, ఒకరికి ఎకరా భూమి కూడా లేదన్నారు. తమ గ్రామం మీదుగా రహదారిని ఎలా వేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు ప్రతులను కలెక్టర్, ఆర్డీవో, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ అధికారులకు పంపారు. కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ రంగయ్య, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, నరేశ్, జంగయ్య, భీమయ్య, గోవర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్యగౌడ్, కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.