అన్నం పెట్టినట్టే పెట్టి ప్లేట్ లాగేసుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు తీరు తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో లక్షల్లో రేషన్ కార్డులు జారీ చేశామని గొప్పలు చెప్తూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెట్టుబడి సాయం, రుణమాఫీ అంటూ రైతులకు, కొత్త పింఛన్లు, పింఛన్ల పెంపు అంటూ మోసం చేసి అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టిన రేవంత్ సర్కారు నిరుపేదల కడుపు కొట్టే కుట్రకు తెర తీసింది. రేషన్ కార్డులను ఇచ్చినట్టే ఇచ్చి ఏడాది తిరగక ముందే తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఐటీ రిటర్న్స్ చేస్తే రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 6 లక్షలు, ఆపై ఆదాయం ఉన్నవారి రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్ఐసీ ఆధారంగా నిర్దేశిత ఆదాయానికి మించి ఐటీ రిటర్న్స్ చేస్తున్న వారి వివరాలను జిల్లాలవారీగా ప్రభుత్వం అధికారులకు అందజేసింది. రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో సుమారు 3 వేలకుపైగా రేషన్ కార్డులను తొలగించనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జీపీవో(గ్రామ పాలనాధికారి)ల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల వారీగా వెరిఫికేషన్ ప్రారంభమైంది. సర్కారు అందజేసిన జాబితాతో సంబంధిత రేషన్ కార్డుదారుల ఇంటింటికీ వెళ్లి జీపీవోలు వెరిఫికేషన్ చేస్తున్నారు. వెరిఫికేషన్లో భాగంగా ‘మీరు 6 లక్షలకుపైగా ఐటీ రిటర్న్స్ చేస్తున్నారని, మీ రేషన్ కార్డు తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా, లేదా ఎంత ఆదాయం ఐటీ రిటర్న్స్ చేస్తున్నారనే’ వివరాలను జీపీవోలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కారు లోన్ తీసుకోవాలన్న కూడా తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటుండడంతో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. బ్యాంకు రుణాల కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినంత మాత్రాన రేషన్ కార్డులను కట్ చేస్తారా అంటూ ప్రజలు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతలేని సన్నబియ్యం
గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్ కార్డులను ఇచ్చామని ఓ వైపు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రేషన్ కార్డులను తొలగిస్తున్న ప్రభుత్వం.. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ సర్కారు పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పితే సంబంధిత ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ బియ్యం రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంఆర్ బియ్యం అందజేయడంలోనే మిల్లర్లు మాయజాలం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో ఉన్న పౌరసరఫరాల శాఖ అధికారులు రెండు, మూడు సీజన్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోయినా పట్టించుకోకపోవడం, మిల్లర్లు ఇచ్చే సీఎంఆర్ బియ్యం క్వాలిటీ కూడా పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏమాత్రం నాణ్యతలేని బియ్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రతీ నెల 5780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డుల సంఖ్య 2,48,475 ఉండగా.. 8,87,912 మంది లబ్ధిదారులున్నారు. వీటిలో అంత్యోదయ కార్డులకు సంబంధించి 26,621 కార్డులకుగాను 79,524 మంది లబ్ధిదారులు., అన్నపూర్ణ కార్డులకు సంబంధించి 41 మంది సభ్యులు, ఆహార భద్రత కార్డులకు సంబంధించి 2,21,818 కార్డులు ఉండగా.. 8,08,347 మంది లబ్ధిదారులున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి జిల్లాలో పండించే సన్నబియ్యం ఒక నెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కూడా సరిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని దిగుమతి చేసుకొని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల జిల్లాల నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతున్నది. ఆయా జిల్లాల నుంచి జిల్లాలోని రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు సన్నబియ్యాన్ని సిద్ధం చేసే ముందు జిల్లా పౌరసరఫరాల అధికారులు సంబంధిత బియ్యం క్వాలిటీని పరిశీలించి, ఆ తర్వాతే సరఫరాకు అనుమతిస్తారు.
ఈ విధంగా చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతను చూస్తే మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మెజార్టీ రేషన్ దుకాణాల్లోనూ సన్నబియ్యం క్వాలిటీ లేకపోవడంతో ప్రజలు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. సర్కారు సరఫరా చేస్తే తాము పంపిణీ చేస్తున్నామని, వాస్తవానికి క్వాలిటీలేని సన్నబియ్యం వస్తున్నదని జిల్లాలోని పలువురు రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రజలు సర్కారును డిమాండ్ చేస్తున్నారు.