వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చేది లేదని పరిగి మండలంలోని రాపోల్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. పరిగి మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట రాపోల్ రైతులు ధర్నా నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలైనా ఇ స్తాం.. కానీ తాతల కాలం నుంచి వస్తున్న భూములను మా త్రం ఇచ్చేది లేదన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటే తాము ఎలా బతకాలని.. తమ పిల్లల ఉపాధి ఏమిటని సర్కార్‌ను ప్రశ్నించారు.
ప్రభుత్వం భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు భూములిచ్చేది లేదని కాళ్లపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన రైతులు తేగేసి చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం అసైన్డ్ భూములను సేకరించేందుకే నోటిఫికేషన్ జారీ చేయగా.. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కేవలం అసైన్డ్, ప్రభుత్వ భూ ములే సేకరిస్తారని పట్టా భూములను సేకరించరని రైతులను నమ్మిం చేందుకు యత్నిస్తున్నా రైతులు మాత్రం పట్టా భూములే కాదు, అసైన్డ్ భూములను కూడా ఇచ్చేది లేదని చెబుతున్నారు. సోమవా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం రాపోల్ రైతు లు కలెక్టరేట్లో ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. రాపోల్కు చెందిన సుమారు 100 మంది రైతులు ఈ పార్కు మాకొద్దు, దొంగ ల రాజ్యం, దోపిడీ రాజ్యమంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.
గ్రామ పంచాయతీ తీర్మానం..
ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేది లేదని రాపోల్, కాళ్లాపూర్ రైతులు స్పష్టం చేశారు. ఇప్పటికే భూములను సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీకిగాని, రైతులకు గాని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కుకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని రాపోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకపక్షంగా తీర్మానం చేసింది. రైతుల జీవనాధారమైన అసైన్డ్ భూములను పార్కు కోసం లాక్కుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భూములను గుంజుకుంటే రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలోని 300-400 కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు.
1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుకు నిర్ణయం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నది. కొడంగల్‌లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములిచ్చేది లేదని దాదాపు ఏడాదిపాటు ఉద్యమించినా, పోలీసులతో బెదిరింపులకు పాల్పడి కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించి భూములను లాక్కున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం .. పరిగి మండల రైతుల భూములనూ ఇండస్ట్రియల్ పార్కు పేరిట బలవంతంగా గుంజుకునేందుకు యత్నాలను ముమ్మరం చేసింది.
అందులో భా గంగానే కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా విడతల వారీగా భూసేకరణ చేసేలా ముందుకెళ్తున్నది. ప్రస్తుతం కాళ్లాపూర్లోని 428 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భా గంగా రెవెన్యూ అధికారులకు భూముల సర్వేకూ అనుమతులివ్వడంతోపాటు భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు కలెక్టర్ లేదా ఆర్డీవోకు సమర్పించాలని సూచించింది. కాళ్లాపూర్‌లో అసైన్డ్ భూములు-428.05ఎకరాలు, పట్టాభూములు 159.25 ఎకరాలు, రాపోల్ గ్రామానికి చెందిన అసైన్డ్ భూములు 509 ఎకరాలు, 101.08 ఎకరాల పట్టా భూములను ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం సేకరించాలని నిర్ణయించారు.
స్పందించకుంటే సెక్రటేరియెట్నూ ముట్టడిస్తాం
ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా గత 40 రోజులుగా పోరాడుతున్నాం. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వరకు వినతిపత్రాలిచ్చాం. ఇప్పటివరకు కలెక్టర్, ఆర్డీవోల నుంచి ఎలాంటి స్పందన లేదు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ పంచాయతీ ఏకపక్షం గా చేసిన తీర్మానాన్ని కూడా వారికి అందించాం. ఇప్పటికీ ప్రభు త్వం స్పందించకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇంటితోపాటు సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తూనే ఉంటాం.
– కృష్ణ, రైతు, రాపోల్
భూమిని తీసుకుంటే రోడ్డున పడుతాం..
ఇండస్ట్రియల్ పార్కు కోసం ఉన్న ఎకరా భూమిని తీసుకుంటే రోడ్డున పడుతాం. ఆ భూమిని నమ్ముకునే ఐదుగురం కుటుంబసభ్యులం బతుకుతున్నాం. దానిని ప్రభుత్వం లాక్కుంటే మాకు చావే శరణ్యం. మాలాంటి చాలామంది పేద రైతులు ఊర్లు వది లి వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. ప్రభుత్వం కంపెనీలు పెట్టి మా జీవితాలను నాశనం చేయొద్దు.
– రాపోల్ అనంతమ్మ, రాపోల్ గ్రామం