మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ నిర్మాణం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమతి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామ రెవెన్యూలో ఉన్న విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఓరియేంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి భవిష్యత్ ఉండాలనే ఆలోచనతోనే ఇంజినీరింగ్‌లో చేరారని, నాలుగు ఏండ్ల పాటు కష్టపడి, క్రమశిక్షణతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు.
నాలుగు ఏండ్లు కష్టపడి చదివితే నలభై ఏండ్లు సుఖపడుతారని చెప్పారు. గొప్ప గొప్ప ఆశలతో తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించారని, వారి కలలను సాకారం చేయడానికి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. కళాశాలలో ఆధునిక సదుపాయాలు కల్పించామని, మంచి వాతావరణం కల్పించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దామని చెప్పారు. సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యా బోధన చేయిస్తున్నామని, విద్యార్థులకు చదువు పట్ల ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే నివృత్తి చేసే అధ్యాపకులు ఉన్నారని పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగాలన్నారు.
మంచి నైపుణ్యంతో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా క్యాంపస్ ద్వారా కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ, డీన్ అనురాగ్, అకాడమిక్ కో ఆర్డినేటర్ శ్రీలత, సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వెంకటచలం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.