పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న దురుద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. ఘటనపై తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తీసుకున్న చర్యలను సమర్థిస్తున్నారు. రాజకీయ పబ్బం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించి బండి సంజయ్‌కి కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల నిర్వహణలో పేపర్ సర్క్యులేట్ చేసిన విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిందితుల దుశ్చర్యలపై మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, పాలన తీరును భ్రష్టు పట్టించాలనే దురుద్దేశంతోనే కొందరు చేసిన కుట్ర పూరితమైన కోణం ఇదని జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, వివిధ సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అయితే, తెలుగు, హిందీ పరీక్షల నిర్వహణలో జరిగిన సర్క్యులేట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి తీసుకున్న చర్యలు న్యాయమైనవే అని వారు వారు పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బండి సంజయ్‌కి కఠినంగా శిక్షించాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తున్నది. పరీక్షా పేపర్లు ప్రచారం కావడం తెలియగానే పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం ఆందోళనకు గురయ్యామని, ఏడాది పాటు అహర్నిశలు కష్టపడిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.
‘బండి’ని కఠినంగా శిక్షించండి
బీజేపీ ఎంపీ ‘బండి’ తెలంగాణ ప్రభుత్వం, పాలనను అభాసుపాల్జేయాలనే దురుద్దేశంతో పదో తరగతి పేపర్ సర్క్యులేట్ చేసేందుకు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పరీక్ష పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యువనేత ‘బంటి’, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘బండి సంజయ్’ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘బీజేపీ డౌన్‌డౌన్, సమాజ ద్రోహులను కఠినంగా శిక్షించాలని’ విద్యార్థులు, యువకులు ప్రధాన రహదారులపైకి వచ్చి పెద్ద పెట్టున నినదించారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
రాజకీయ లబ్ధికోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మంచి పరిణామం కాదు. విద్యార్థులు సంవత్సరాలుగా కష్టపడి చదివిన చదువు అంతా వృథా అవుతున్నది. విద్యార్థులు భవిష్యత్‌పై దృష్టిలో ఉంచుకుని ర్యాంకులు సాధించాలని రాత్రింబవళ్లు చదివి పరీక్షలకు సన్నద్ధం అవుతారు. ప్రశ్నాపత్రం ప్రచారం ద్వారా వారి ఆశలు, ఆశయాల మీద దెబ్బకొట్టినట్టవుతుంది. పేపర్ ప్రచారం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
– రాజశేఖర్, ఉపాధ్యాయుడు
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రశ్నాపత్రం ప్రచారం చేసిన వారు ఎంతటి వారైన ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి. మా పిల్లలు సంవత్సరం నుంచి కష్టపడి చదివి ర్యాంకులను సాధించి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలుచేరుకోవాలని కలలుకన్నారు. పేపర్ సర్క్యులేట్ కావడం వల్ల బాగా చదువుకునే విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుంది. నా కొడుకు సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి చదివాడు, ఈ వ్యవహరం తెలుసుకుని బాధపడ్డాడు.
– నర్సింహులు, విద్యార్థి తండ్రి
ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడాలని పదో తరగతి పరీక్ష పేపర్‌ను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాల్సిందే. పరీక్ష పేపర్ సర్క్యులేట్ అయితే విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
– గడ్డల శ్రీశైలం, అంతిరెడ్డిగూడ
పిల్లలను ఇబ్బందులకు గురిచేసింది..
పదో తరగతి పేపర్ ప్రచారంతో మా పిల్లలకు ఆవేదన, ఆందోళన కలిగించింది. కొందరిరాజకీయ దాహార్తికి పిల్లలను బాధపెట్టడం మంచిదికాదు. పథకం ప్రకారం బండి సంజయ్ పదో తరగతి పేపర్ సర్క్యులేట్ చేశారు. బంగారు భవిష్యత్‌ను విద్యార్థులకు ఇవ్వాల్సింది పోయి బీజేపీ వారి జీవితాలతో ఆడుకోవడం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య బాగుంది. అతడికి కఠినమైన శిక్ష పడాలి.
తాండూరులో బండిసంజయ్ దిష్టిబొమ్మ దహనం
తాండూరు, ఏప్రిల్ 6: బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని బీజేపీ పేపర్ బయటకు వచ్చేలా కుట్రలు పన్ని విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం సరైన పద్ధతి కాదని తాండూరు బీఆర్ఎస్వీ ప్రతినిధులు పేర్కొన్నారు. పదోతరగతి పేపర్ అవుట్ కుట్ర బండి సంజయ్దేనంటూ గురువారం సాయంత్రం తాండూరులో బండిసంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ తాండూరు నియోజకవర్గం ప్రతినిధి జిలాని, తాండూరు పట్టణ ప్రతినిధులు సందీప్‌రెడ్డి, దీపక్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అనేక కుట్రలకు దారితీస్తుందన్నారు. పక్కా పథకం ప్రకారమే తాండూరులో టెన్త్ తెలుగు, వరంగల్‌లో హిందీ ప్రశ్నాపత్రాలు పరీక్షల సమయంలో బయటకు పంపారని ఆరోపించారు. నిందితులకు బీజేపీతో లింకులు ఉన్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ కుట్రలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నీచమైన బీజేపీ నేతలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.
నిందితులకు జైలు శిక్ష వేయాలె..
మా పిల్లలు ఏడాదిగా పగలనకా, రాత్రనకా ఎంతో కష్టపడి చదివిన్రు. ఈ పేపర్ సర్క్యులేట్ అవుడు.. మమ్మల్ని మా పిల్లల్ని చానా ఇబ్బందుల పాల్జేస్తుంది. రాజకీయంలో ఏదైనా చేసుకోవాలె.. కాని, ఇట్లా పిల్లల జీవితాలతో ఆడుకుంటరా..? నిందితులను జైలుకు పంపించి ప్రభుత్వం మంచి పని చేసింది. బండి సంజయ్‌కి శిక్ష పడాలి.
– యాదయ్య, టీవీల మెకానిక్,
మాలేపల్లి, ఆమనగల్లు
ఇంకొకరు చేయకూడదు..
పదో తరగతి పేపర్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయడం న్యాయమైన చర్యే. ఇట్లాంటివి మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పేపర్ పరీక్షా సమయంలో బయటకు రావడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. పరీక్ష పేపర్లను ప్రచారం చేసిన నిందితులను శిక్షించాలి. – చరణ్, వంశీ, అరుణ్,
మాడ్గుల (గ్రా/మం)
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకోవద్దు..
పేపర్ సర్క్యులేట్ వల్ల చాలా ఆందోళనకు గురయ్యా. బీజేపీ నాయకులు నీచ సంస్కృతికి ఒడిగడుతున్నరు. వాళ్ల రాజకీయ లబ్ధి కోసం మా లాంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నరు. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు. రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరైందికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయడం సరైన నిర్ణయం.
– జంతుక రాకేశ్, పదో తరగతి విద్యార్థి,
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఆమనగల్లు
ద్రోహులకు బుద్ధి చెప్పాలి
పదో తరగతి పరీక్షలు పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్నాయన్న అవగాహన లేకుండా పరీక్షల పేపర్ల సర్క్యులేట్కు పాల్పడటం దుర్మార్గమైన చర్య. ఈ నీచమైన చర్యలో ప్రధాన నిందితుడైన బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం మంచి పరిణామం. సమాజ ద్రోహులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
– బవాండ్లపల్లి నర్సింహ, మాడ్గుల
విద్యార్థుల జీవితాలతో చెలగాటం..
టెన్త్ ప్రశ్నా పత్రం ప్రచార వ్యవహారం విద్యార్థుల జీవితాలతో ముడి పడి ఉంటుంది. విద్యార్థుల జీవితాలతో చెటగాటం ఆడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్రతి విద్యార్థి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. ఇది ఎంతవరకు మంచిది కాదు.
– తేజశ్రీ, 10వ తరగతి విద్యార్థిని, దేవునిఎర్రవల్లి ప్రభుత్వ పాఠశాల, చేవెళ్ల మండలం
బీజేపీ చిల్లర రాజకీయం మానుకోవాలి
బీజేపీ చిల్లర రాజకీయం మానుకోవాలి. స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడితే సహించం. రానున్న ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతాం.
– రమేష్, విఠ్యాల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం