షాద్‌నగర్, ఆగస్టు 23 : భారీ పరిశ్రమల శ్రీకారం.. యువతకు ఉపాధి మార్గాన్ని సుగమం చేస్తున్నది. స్థానికంగానే కాకుండా రాష్ట్రంలో భారీ పారిశ్రామిక కేంద్రంగా షాద్‌నగర్ ప్రాంతం అవతరిస్తున్నది. పురోగతి దిశలో పారిశ్రామిక రంగం పయనిస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు భారీగా వెలుస్తున్నాయి. గతం కంటే అదనంగా 30వేల మందికి ఉపాధి లభిస్తున్నది. అమెజాన్, పీ అండ్ జీ, నాట్కో, ఎంఎస్ఎన్ వంటి ఎన్నో పరిశ్రమలకు నెలవుగా మారింది. దేశంలోని అన్ని రాష్ర్టాలవారు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతగా నష్టపోయిందో.. అంతేకంటే రెండు రెట్లు పాలమూరు ప్రాంతం నష్టపోయింది. సీమాంధ్రుల పాలనలో షాద్‌నగర్‌లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదు. ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు హయాంలో కొత్తూరును పారిశ్రామిక ప్రాంతంగా గుర్తిస్తూ ఇక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కాలానుగుణంగా షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండలాలతోపాటు స్థానికంగా భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు వెలిశాయి. అయితే పారిశ్రామికవాడ ఊహించిన రీతిలో ఎదుగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి పలు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వేలాదిమంది కార్మికులు రోడ్డున
స్వరాష్ట్రంలో..
షాద్‌నగర్ ప్రాంతం భారీ పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి మార్గాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వలసలను నివారించడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ప్రారంభించి ఎన్నో పరిశ్రమలు పురుడుపోసుకునేలా చేసింది. నేడు కొత్తూరు, షాద్‌నగర్ పారిశ్రామికవాడల్లో సుమారు 200లకు పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ప్రపంచస్థాయి గుర్తింపుపొందిన ఫార్మా, వస్ర్తాలు, కాస్మొటిక్స్, ముడి ఇనుము, చమురు, లెదర్, ఫైబర్, తినుబండారాల తయారీ వంటి పరిశ్రమలున్నాయి. దీంతో గతం కంటే అదనంగా మరో 30వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ర్టాలు, నేపాల్ దేశానికి చెందిన పలువురు కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు.
టీఎస్ ఐపాస్‌తో..
ఏడేండ్ల కాలంలో పీఅండ్‌జీ అనే అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ, ఎంఎస్ఎన్ ఫార్మా, అమేజాన్ సంస్థ, ఫోకర్ణ క్వార్జ్ టైల్స్ వంటి భారీ పరిశ్రమలు, విజయ పాలిమర్స్, టోటల్ అయిల్వంటి పరిశ్రమలతోపాటు పదుల సంఖ్యలో అదనంగా షాద్‌నగర్ ప్రాంతంలో వెలిశాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 180కి పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 60 వేల మంది ఉపాధి పొందుతున్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తూరు పారిశ్రామికవాడ, నందిగామ, ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడ, బూర్గుల, ఎలికట్ట, మొగిలిగిద్ద, ఫరూఖ్‌నగర్, చిల్కమర్రి, రాయికల్, రామేశ్వరం, అన్నారం, నందిగామ మండలం మేకగూడ, సంఘీగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ, రంగాపూర్, చేగూరు, కొత్తూరుతో పాటు తిమ్మాపూర్, ఫాతిమాపూర్, ఇన్ముల్‌నర్వ, సిద్దాపూర్, పెంజర్ల, కొందుర్గుతోపాటు శ్రీరంగాపూర్, రాంచంద్రాపూర్, చౌదరిగూడతోపాటు లాల్‌పహాడ్ గ్రామాల్లో పరిశ్రమలు వెలిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో కంసాన్పల్లి గ్రామంలో మేలుజాతి పశువీర్యోత్పత్తి కేంద్రం అందుబాటులోకి రానున్నది.
ఉపాధి పెంచుతాం : అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
ఇప్పుడున్న పరిశ్రమలతోపాటు వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు మన ప్రాంతంలో ఇంకా వెలుస్తాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ కాలుష్య పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా మన ప్రాంతంలో పరిశ్రమలను సందర్శించి ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింత ఉపాధి పెరుగనున్నది. పనిచేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో పని దొరుకుతుంది. త్వరలో ఉపాధి కల్పన శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
కచ్చితంగా ఉపాధి : నవీన్‌కుమార్, కార్మికుడు, కేడీఎల్ పరిశ్రమ, నందిగామ గతంలో చాలా మందికి ఉపాధి ఉండేది కాదు. స్థానికులకు తక్కువ అవకాశాలుండేవి. అందరూ పట్నం పోయేవారు. కానీ పరిస్థితి మారింది. కొత్త పరిశ్రమలొచ్చాయి. పనిచేయాలనుకునేవారికి కచ్చితంగా ఏదో ఒక పరిశ్రమలో ఉపాధి దొరుకుతుంది.