పూడూరు , ఆగస్టు 23 : జీహెచ్ఎంసీ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడక్ట్స్ పరిశ్రమలను రాకంచర్ల పారిశ్రామికవాడలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు. సోమవారం పూడూరు మండలం రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్క్‌ను ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి పార్కులో ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలకు కేటాయించిన భూమిని, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రాకంచర్ల, పూడూరు గ్రామాలకు చెందిన సుమారు 150 ఎకరాల భూమిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకై 2008లో ప్రభుత్వం భూ సేకరణ చేసినట్లు తెలిపారు.
నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న స్టీల్ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తరలించి.. నగరంలో గూడ్స్ వాహనాల రద్దీ తగ్గించడంతోపాటు ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలోనే కాటేదాన్‌లో ఉన్న 20 ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్కులోకి తరలించాలని అక్కడి యజమానులకు టీఎస్ఐఐసీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. రాకంచర్లలో స్థలాలు కేటాయించినప్పటికీ వారు నిర్మాణాలపై దృష్టి పెట్టడంలేదన్నారు. వారు పరిశ్రమలను తరలించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరు నెలల వరకు వారికి ఇక్కడికి వచ్చేలా అవకాశం కల్పిస్తామని, రాకపోతే కాటేదాన్ పరిశ్రమ రద్దుతోపాటు రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్కులో కేటాయించిన భూమిని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. రాకంచర్లలో అవసరమైన మౌలిక వసతులను టీఎస్ ఐఐసీ కల్పించిందన్నారు. ప్రస్తుతం నాలుగు కొత్త ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమల నిర్మాణాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. స్టీల్ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే జనరల్ పార్కుగా మారుస్తూ అన్ని పరిశ్రమల ఏర్పాట్లకై అవకాశం కల్పిస్తామన్నారు.
ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ సీం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశ్రమల ఏర్పాట్లకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, పరిశ్రమలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతాల యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. పరిశ్రమల టాక్స్ డబ్బులు నేరుగా గ్రామపంచాయతీలకు వచ్చేలా అవకాశం కల్పించాలని తిర్మలాపూర్(రాకంచర్ల) మాజీ సర్పంచ్ పెంటయ్య చైర్మన్ బాలమల్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, నాయకులు నర్సింహారెడ్డి, శుభప్రద్‌పటేల్, ఉపసర్పంచ్ టి.రాజేందర్, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.