నందిగామ : పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా భరోసాను కల్పిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 49 చెక్కుల పంపిణీ శుక్రవారం నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
అదే విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో వైకుంఠధామలు ఏర్పాటు చేయడం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తుండటంతో గ్రామాల రూపురేఖలు మారిపోయి పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీలు, నాయకులు పాల్గొన్నారు.