రంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : అటవీ విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ‘తెలంగాణకు హరితహారం’తో పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించిన రాష్ట్ర సర్కార్.. దట్టమైన అడవులనూ పెంచేందుకు ‘హరితవనాలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అడవుల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అడవుల పెంపకంపై రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు దృష్టి సారించారు. వచ్చే రెండేండ్లలో జిల్లాలో 3కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. అడవుల్లో ఖాళీ స్థలమంటూ ఉండకుండా మొక్కలు పెంచేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఖాళీ స్థలాలను గుర్తించగా.. వచ్చే నెల నుంచి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది 1.50 కోట్లు, వచ్చే ఏడాది మరో 1.50 కోట్ల చొప్పున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోపాటు గ్రీన్ ఫండ్ నిధులను వాడుకోనున్నారు. ఏప్రిల్ నుంచి గ్రీన్ఫండ్ కింద అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరుల నుంచి నిధుల జమ ప్రారంభమైంది. జిల్లాలో ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలోని 83 బ్లాకుల పరిధిలో 29,282 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉండగా.. 501 హెక్టార్లలో మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. అధికంగా పండ్లు, ఔషధ మొక్కలు నాటే దిశగా అధికారులు ముందుకుసాగుతున్నారు.
రానున్న రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని దట్టమైన అడవులుగా మార్చేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటేందుకు నిర్ణయించారు. జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతాన్ని హరితవనాలుగా మార్చడమే లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, తాజాగా హరితవనాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు.
వచ్చే రెండేండ్లలో జిల్లాలోని అడవులను ఎక్కడ చూసినా చిట్టడవిలా మార్చేందుకు ప్లాన్ చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రాంతమంతా హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉంటుంది. కాబట్టి పచ్చదనాన్ని మరింత పెంపొందించేలా చర్యలు చేపట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 6 కోట్ల మొక్కలను నాటడం పూర్తి చేశారు. పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలో 83 బ్లాకులుండగా, 29,282 హెక్టార్లలో అటవీ ప్రాంత విస్తీర్ణం ఉంది.
ఈ ఏడాది 501 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు ప్లాన్..
జిల్లాలో అటవీ ప్రాంత పచ్చదనం పెంపుపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకుగాను అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం అధిక మొత్తంలో అటవీ ప్రాంతంలో మొక్కలను నాటేందుకు అటవీ శాఖ యంత్రాంగం నిర్ణయించింది.
వచ్చే నెల నుంచి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటనున్నారు. ఈ ఏడాది 1.50 కోట్ల మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది మరో 1.50 కోట్ల మొక్కలను నాటేందుకుగాను ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలోని 83 బ్లాకుల్లో ఇప్పటికే ఖాళీ ప్రాంతాలను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో రెండేండ్లలో 3కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోపాటు గ్రీన్ ఫండ్ నిధులను హరితహారం కార్యక్రమానికి వినియోగించనున్నారు.
ఏప్రిల్ నుంచే గ్రీన్ఫండ్ కింద అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరాల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన దానికి అనుగుణంగా గ్రీన్ఫండ్లో నిధులను జమ చేశారు. మరోవైపు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నెమలినార, నారవేపి, బూరుగ, కానుగ, రావి, అల్లనేరేడు, మర్రి, చింత, జువ్వి, ఇప్పా, నారవేప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, ఏరుమద్ది, నల్లమద్ది, టేకు, చిందుగ, సీతాఫల్, ఉసిరి, మారేడు తదితర మొక్కలను నాటనున్నారు. ఇవేకాకుండా ఔషధ మొక్కలైన వేప, కాచు, దర్శనం, అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, కానుగ, తెల్ల విరుగుడు, మర్రి, మేడి, నారవేప, చిన్నంగి, ఇప్పా, మామిడి, జీడి, దొరిసేన, గన్నేరు, చిల్లగింజ, చింత, టేకు, తెల్లమద్ది, కరక్కాయ, ఇనుముద్ది, అంకుడు చెట్టు, పెద్ద రేగు, పరాకి, ముష్టిగంగా, పెద్ద గుమ్ముడు టేకు, అజఘ్నము, అడ్డాకు, కలేచెట్టు, పసుపు, పెద్ద మాను, చిందుగ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, జిల్లేడు తదితర ఔషధ మొక్కలను నాటనున్నారు.
3కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక..
జిల్లాలో హరితవనాలు కార్యక్రమంలో భాగంగా రెండేండ్లలో 3 కోట్ల మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం. జిల్లాలోని అటవీ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులుగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ ఏడాది 501 హెక్టార్లలో ఖాళీ ఉన్న ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. మీటరుకు ఒక మొక్కను నాటేందుకు నిర్ణయించాం. మొక్కలను నాటడంతోపాటు మొక్కల సంరక్షణకు కూడా చర్యలు చేపట్టాం.
– జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్