ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నందివనపర్తి, జాఫర్‌గూడ గ్రామాల్లో శనివారం రాత్రి యాదవులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల జగదీశ్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు ప్రతీక అని అన్నారు. సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు దున్నపోతుల విన్యాసాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కసరమోని మల్లేశ్, చిందం బాలరాజు, చిందం రాఘవేందర్, మహేశ్, ముచ్చర్ల వెంకటేశ్, చీమల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్ శేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం జాఫర్‌గూడ గ్రామంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.
నందివనపర్తిలో..
యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో శనివారం రాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో బ్యాండు మేళాల మధ్య దున్నపోతులను అలంకరించి ఊరేగించారు. అనంతరం దున్నపోతుల విన్యాసాలను ప్రదర్శించారు.