బొంరాస్పేట, సెప్టెంబర్ 20 : రైతులు చామంతి పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. బోరు సౌకర్యం ఉన్న రైతులు ఎక్కువగా వరిని పండిస్తారు. ఎప్పుడూ ఒకే రకమైన, సంప్రదాయ పంటలను సాగు చేసే బదులుగా ఆరుతడి పంటలను ఎంచుకుని సాగు చేస్తున్నారు. మార్కెట్లో పూలు, కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. కూరగాయలు, పూల సాగుతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
మండలంలోని బొట్లవానితండా, దేవులానాయక్తండాలకు చెందిన రైతులు ఏడు ఎకరాల్లో చామంతి పూలను సాగు చేస్తున్నారు. దేవులానాయక్తండాలో వడ్త్యా పండరి 2 ఎకరాలు, విఠల్నాయక్ 2 ఎకరాలు, బాల్రాం అరఎకరా, పిన్యానాయక్ అరఎకరా, బొట్లవానితండాలో ఠాకూర్ అర ఎకరా పొలంలో చామంతి పూలను సాగు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో శంషాబాద్ సమీపంలో ఉన్న నర్సరీ నుంచి చామంతి పూల నారు తెచ్చి నాటి బోరుద్వారా నీరందించారు. ఆరు నెలలకు పూలు పూసాయి. మున్ముందు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఉండడంతో చామంతిపూలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది.
బతుకమ్మలను పేర్చడానికి, యంత్రాలకు పూజలు చేయడానికి, లక్ష్మీ పూజలు, గౌరమ్మ నోములు, సత్యనారాయణ వ్రతాలు, గృహ ప్రవేశాలు, వివాహాది శుభ కార్యాలయాలకు బంతి, చామంతి పూలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒక్కసారి నారు పెడితే మొక్కలు పెరిగి ఆరు నెలల్లో పూలు చేతికివస్తాయి. పూలు తెంచేకొద్దీ కాస్తూనే ఉంటాయి. రెండు నెలల వరకు పూలు కాస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చామంతి పూలు క్వింటాలుకు రూ.2 వేలు ఉంది. గణేష్ నిమజ్జనం సమయంలో ఇవే పూలు క్వింటాలుకు రూ.16 వేలు ధర పలికిందని రైతులు తెలిపారు. వారానికి ఒకసారి రైతులు పూలను తెంచి హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్లో అమ్ముకుని లాభం పొందుతున్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు వచ్చే పూల సాగును ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సహిస్తే సాగు పెరిగి రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.
పూలసాగులో లాభం ఉంది
నాకు రెండు ఎకరాల చెల్క ఉంది. యాసంగిలో పల్లీ పంట వేసేవాడిని. మందులు కొట్టి కొట్టి భూమి అంతా నిస్సారంగా మారింది. మా అల్లుడి సూచన మేరకు ఈ ఏడాది నుంచి పంట మార్పిడి చేసి పూల సాగు చేద్దామని ఆలోచించి చామంతి పూలు పండిస్తున్నా. శంషాబాద్ సమీపంలో ఉన్న నర్సరీలో నారు తెచ్చి నాటాను. ఎకరా పొలానికి పెట్టుబడి రూ.40 వేలు అయింది. ఎండా కాలంలో బోరుద్వారా నీళ్లు పెట్టాను. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్లు పెడుతూ మందులు కొడుతూ తోటను కాపాడుకుంటున్నా. వారానికి ఒకసారి పూలు తెంచి గుడిమల్కాపూర్ మార్కెట్లో అమ్ముతాను. రెండు మూడు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి తీరిపోతుంది. పూలసాగుతో మంచి లాభం వస్తుంది.
– వడ్త్యా పండరి రైతు, దేవులానాయక్తండా