ఉమ్మడి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీలు నిర్వహించడంతో ప్రధాన రహదారులన్నీ త్రివర్ణమయంగా మారాయి. మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్-బడంగ్‌పేట వరకు నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొనగా.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరై యువతను ఉత్సాహపరిచారు. కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
రంగారెడ్డి, సెప్టెంబర్ 16, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు అట్టహాసంగా జరిగాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్-బడంగ్పేట్ వరకు పది వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
మీర్పేట్ నుంచి ఐదు కిలో మీటర్ల వరకు ర్యాలీలో పాద యాత్రగా మంత్రి వచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు త్రివర్ణ పతాకాలు, భారీ ర్యాలీలతో జనసంద్రంగా మారింది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి అడుగుపెట్టి 75 ఏండ్లవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీల్లో అశేష జనవాహిని తరలివచ్చి జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జాతీయతా భావాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవాల ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మనం భారతీయులం అనే స్ఫూర్తిని జాతీయ సమైక్యతా ర్యాలీతో చాటి చెప్పారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికై జెండా పట్టి పోరాడిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, గడపగడపకు స్వాతంత్య్ర ఫలాలు అందించాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించారని మంత్రి పేర్కొన్నారు.
పరిగి, సెప్టెంబర్ 16 : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి సంగెం లక్ష్మీబాయి పాఠశాల వరకు, పరిగిలో కొడంగల్ క్రాస్‌రోడ్డు నుంచి మినీ స్టేడియం వరకు, తాండూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలెమూన్ స్కూల్ వరకు, కొడంగల్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు.
ఈ ర్యాలీల్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, ఫైలెట్ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్‌పటేల్, ఎస్పీ కోటిరెడ్డి, ఆయా నియోజకవర్గాల నోడల్ ఆఫీసర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థులు.. ఇలా వేలాది మంది త్రివర్ణ పతాకాలను చేత పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.