పరిగి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11 : కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అతి తక్కువ సమయంలోనే దేశంలోనే వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, తద్వారా తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాలని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేండ్ల కాలంలో ఇటు ప్రగతిలో, మరోవైపు సంక్షేమ రంగంలో వినూత్నమైన కార్యక్రమాల అమలు ద్వారా అభివృద్ధిని చేసి చూపించడంతోపాటు దేశంలోనే అత్యధికంగా సంక్షేమ రంగానికి ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వేతనాల పెంపు దగ్గర నుంచి అనేక విషయాల్లో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ఒక విజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ రూపురేఖలు అతి తక్కువ సమయంలో మారుతాయనడంలో సందేహం లేదని తెలిపారు. దేశంలోని వనరుల వినియోగం, అభివృద్ధిపై కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, ఇలాంటి సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు ప్రస్తుతం లేరని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఒక పౌరుడి తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని ఒక పౌరుడి తలసరి ఆదాయం అధికంగా ఉందంటే కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న చక్కటి పాలన తీరుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగిడి దేశాన్ని ప్రపంచంలోనే ఒక తిరుగులేని శక్తిగా మార్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయ పునరేకీకరణకు జాతీయ పార్టీ పెట్టాల్సిందే..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని పలువురు నిపుణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలంటే రాజకీయ పునరేకీకరణ ఎంతో అవసరమని, అది ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని పలువురు ఆకాంక్షిస్తున్నారు. దేశానికి రైతు వెన్నుముక అని అలాంటి రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమన్నారు. రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, దళిత బంధు వంటి పథకాలు దేశ ప్రజలందరికీ ఎంతో అవసరమన్నారు. పాఠశాలల్లో పౌష్టికాహారం, గుణాత్మకమైన విద్య దేశంలో ఎక్కడాలేని విధంగా అమలవుతున్నదన్నారు. ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు జరుగాలంటే జాతీయస్థాయిలో ప్రవేశించాల్సిన అవసరముందని పేర్కొంటున్నారు.
దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదే.. : మల్లారెడ్డి, అటవీశాఖ ఉద్యోగి, బొంరాస్‌పేట
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదే. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. దీనివల్ల దేశంలోని రైతాంగానికి, పేదలకు ఎంతో మేలు కలుగుతుంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అదృష్టం బాగుండి కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ ఇంకా అభివృద్ధిలో దూసుకుపోతుంది.
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతారు : లక్ష్మణ్. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సత్తా చాటుతారు. ఓటమెరుగని నేత కేసీఆర్. తెలంగాణాను అన్ని రంగాల్లో ముందుంచి దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో పీఆర్సీ ఎలా ఇస్తున్నారో.. కేంద్ర ఉద్యోగులకు కూడా ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు ఉంది.
దేశ భవిష్యత్తును మార్చగలిగే నేత కేసీఆర్: ఎంపీడీవో వెంకయ్య
రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను దేశంలో ప్రవేశపెడితే రైతుల ఆత్మహత్యలుండవు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను దేశం లో తక్కువ సమయంలో నిర్మిం చి నీటి సమస్యను రాకుండా చేయగల సత్తా కేసీఆర్‌కు ఉంది. దేశ ప్రజల భవిష్యత్‌ను మార్చగలిగే నేత సీఎం కేసీఆర్.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అత్యవసరం : కాట్రావత్ రాంచందర్, మెదక్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి, మక్తవెంకటాపూర్, కులకచర్ల
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అత్యవవసరం. జాతీయ స్థాయిలో ప్రజాసంక్షేమాన్ని కోరుకునే నాయకత్వం అవసరం. ప్రైవేటైజేషన్‌ను తగ్గించి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ సమసమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తీ వారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం.
కేసీఆర్‌తో దేశ ప్రగతి : బాలరాజ్, బీసీ హాస్టల్ వార్డెన్, నవాబుపేట
మా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం, సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తూ పాలు గూడు, అరటిపండ్లు ఇస్తున్నాం. రాష్ర్టం ఏర్పాటైనప్పటి నుంచి విద్యార్థులకు రోజూ అందజేసే ఆహారపు మెస్ చార్జీలు పెరిగాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి మరింత జరుగుతుంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చారిత్రక అవసరం : జంగయ్య, హెచ్ఎం, కడ్తాల్ మండలం
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, రెండు జతల యూనిఫాంలు, పుస్తకాలు అందజేస్తున్నారు. మౌలిక వసతులను కల్పిస్తున్నది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటం చారిత్రక అవసరం. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే సత్తా కేసీఆర్‌కే ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇలాంటి నాయకుడి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారని ఇతర రాష్ర్టాల సీఎంలు అభినందిస్తున్నారు.