పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 8 : చిమ్మ చీకట్లో విద్యుత్ దీపాలు ధగధగ మెరిసిపోతుంటాయి.. ఓ పది మంది మహిళలు లైట్లు పట్టుకుని నెమ్మదిగా ముందుకు కదులుతుంటారు.. డీజే సౌండ్లు దద్దరిల్లిపోతుంటాయి.. రంగు రంగుల పొగలు గాల్లోకి లేస్తుంటాయి.. రంగు రంగుల కాగితాలన్నీ రోడ్లను ముంచేస్తుంటాయి.. 240, 120, 60 షాట్స్ పటాకులతో ఆకాశం సైతం కొత్త వర్ణాన్ని సంతరించుకుంటుందా అన్నట్లు ఆకట్టుకుంటున్నది.. ఇదంతా ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు నడిస్తే ఓ చిన్న గణపతి జీపుపై దర్శనమిస్తాడు.. అప్పుడు కానీ, అర్థం కాదు అది నిమజ్జన వేడుకని. చిన్న వినాయకుడైనా ఎంతభారీగా నిమజ్జనం చేశామన్నదే లెక్క అంటున్నారు చాలామంది యువకులు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. చిట్టి గణపతికి కూడా గట్టిగానే వీడ్కోలు పలుకుతున్నారు.
జీపుపై వినాయకుడు
కాలనీలు, ఆఫీసులు, పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో చిన్న గణపతులను ఏర్పాటుచేశారు. నిమజ్జన సమయంలో జీపు ముందు భాగంలో చిన్న వినాయక ప్రతిమను ఏర్పాటుచేసుకొని వినాయకుడిని తరలించారు.
ప్యాడ్ బ్యాండ్‌కు ప్రాధాన్యం
అత్యధికంగా దాదాపు 16 మంది బృందం వాయించే ప్యాడ్ బ్యాండ్ ధర ప్రస్తుత నిమజ్జన సమయంలో రూ.లక్ష వరకు ఉండగా.. చిట్కీల బ్యాండ్‌కు సైతం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువమంది ప్యాడ్ బ్యాండ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిట్కీల బ్యాండ్ సైతం ఒక్కొక్కరికీ రూ.2500 నుంచి 3800 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికితోడు పటాకుల శబ్దాలు మరింత ఊపునిస్తున్నాయి. ఎవరికివారు ప్రత్యేకతను చాటుకునేలా నిమజ్జనాన్ని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. కోలాటం ఆడుతూ యువతులు సైతం ఉత్సాహంగా నిమజ్జనాల్లో పాలుపంచుకుంటున్నారు. ఒకప్పుడు నగరానికి పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలనూ తాకింది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో నిమజ్జనం సందడి మరింత ఎక్కువగానే ఉంటున్నది. నిమజ్జనం వేళ ప్రసాదాలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. వినాయకుడి ప్రతిమ చిన్నదయినా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రసాద ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. నిమజ్జనంలో ఆసాంతం ప్రసాద పంపిణీ చేపడుతున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల కాలనీల్లో పూజలు చేసిన యువతీయువకులు, మహిళలే స్వయంగా వినాయక విగ్రహాన్ని నూకుడుబండిపై నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు.
ప్రత్యేక డ్రెస్ కోడ్
నిమజ్జనం అనగానే ఏ కలర్ కుడతా, పైజామా తెచ్చుకుందామనేదే మొదటి ప్రశ్న. డ్రెస్ కోడ్ అనేది అంత ట్రెండ్ అయింది. అందుకు తగ్గట్లే మార్కెట్లో సైతం భిన్నమైన రంగుల్లో డ్రెస్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. కాలనీల్లో యువతులకు ఓ రంగు, యువకులకు మరో రంగుల డ్రెస్‌లు ఎంపిక చేస్తున్నారు. మరికొందరు తెల్ల టీషర్టులు, బ్లూజీన్స్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నెత్తిపై కాషాయం టోపీ ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఇక కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో పగిడీలు సైతం ధరించి సమూహంగా ముందుకెళ్తున్నారు.