షాద్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 3 : షాద్‌నగర్ మున్సిపాలిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలోని శ్రీశివమారుతిగీతా అయ్యప్ప మందిరంలోని గణనాథుడు హరిద్రా గణపతి అలంకరణలో ఆదివారం దర్శనమిచ్చారు. పట్టణంలోని గాంధీనగర్‌కాలనీలో శ్రీచైతన్యయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ప్రారంభించారు. ఎంజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడితో ఉన్న గణనాథుడు, సాంబశివకాలనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడితో విఘ్నేశ్వరుడు, అయ్యప్పకాలనీలో జై భజరంగ్యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలరాతి వంటి గణపయ్య, శివపార్వతియూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గజేంద్రుల సింహాసనంపై ఉన్న ఏకదంతుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. రంగు రంగు వినాయకుల ప్రతిమలకు ఏ మాత్రం తీసిపోకుండా తిరుమల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్య అందరినీ ఆకర్షిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణనాథుడిని నెలకొల్పినట్లు యూత్ సభ్యులు తెలిపారు.
కడ్తాల్ మండలంలో..
కడ్తాల్ : మండల కేంద్రంతోపాటు పరిధిలోని గ్రామాలు, తండాలలో ప్రతిష్ఠించిన వినాయకులకు నిత్యం ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఉదయం, రాత్రివేళ్లలో స్వామివారికి పులిహోర, పాయసం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మండల కేంద్రంలో హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఆదివారం ఉదయం తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహకార సంఘం సంచాలకుడు బాచిరెడ్డి శాయిరెడ్డి, మదలాసా దంపతులు పూజలు చేశారు.
ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
మొయినాబాద్ : గణేశ్ ఉత్సవాలు ఐక్యతను పెంచడం కోసం నిర్వహించే సంప్రదాయమని.. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ లక్ష్మీరెడ్డి అన్నారు. సురంగల్‌లో గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో మాజీ ఎంపీటీసీ ఈగ రమాదేవి, టీఆర్ఎస్ నాయకుడు ఈగ రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐతోపాటు ఎస్ఐ లింగానాయక్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువకులు భక్తిని పెంచుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. నిమజ్జనాన్ని ఎలాంటి విఘాతం కలిగించకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
మంచాలలో గణపతి హోమం
మంచాల : గ్రామంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి హోమం, సరస్వతి హోమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో 15మంది దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో భారత్ గ్యాస్ మేనేజర్ మధుకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే, పలు కాలనీలతోపాటు మండలంలోని రాయపోల్, దండుమైలారం, ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లో అన్నదానం, పూజలు జరిగాయి.
చూడముచ్చటగా మూషికవాహనుడు
పెద్దఅంబర్‌పేట : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ 16వ వార్డు వైఎస్సార్‌నగర్ కాలనీలోని శివ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. ఉత్సవ కమిటీవారు నిత్యం ఒక డెకరేషన్తో ఏర్పాట్లు చేస్తున్నారు. మండపం ప్రారంభంలోనే శ్రీకృష్ణుడి విగ్రహం స్వాగతం పలుకుతుండగా.. ఆయన చేతిలోని కుండనుంచి నీరు పడుతున్నట్టు ఉంటుంది. మండపంలో చుట్టూ పచ్చదనం.. పూలమొక్కలు వేలాడుతూ.. విద్యుత్ ధగధగల మధ్య ఆద్యంతం ఆకట్టుకుంటున్నది.
భక్తితోనే మనిషికి ముక్తి
చేవెళ్లటౌన్ : భక్తితోనే మనిషికి ముక్తి లభిస్తుందని, అందరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్లలో నెలకొల్పిన వినాయక విగ్రహాల వద్ద ఎమ్మెల్యే యాదయ్య పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో అనందంగా జీవించేలా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండేలా గణపయ్యను వేడుకున్నట్లు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడా పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, నాయకులు ఉన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్లలోని అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో పూజారి కిరణ్ కుమార్, కమిటీ సభ్యుల అధ్వర్యంలో గణపతి హోమం కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులను పూజారి ఘనంగా సన్మానించారు.
ఆలయానికి రూ.51116 విరాళం
వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పూజారి శ్రీపాదు కోరారు. చేవెళ్లకు చెందిన కనకమామిడి శ్రీరామ్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆలయంలో ఫ్లోరింగ్ గ్రానేట్ బండలు వేయడానికి రూ.51,116లను విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడంఅభినందనీయమని పేర్కొన్నారు.
నందిగామలో..
నందిగామ : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల్లో నందిగామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి పూజలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. నిమజ్జనానికి నందిగామలోని అంబాపురం చెరువు వద్ద ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
షాబాద్ మండలంలో..
షాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో గణనాథులకు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. షాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం వినాయకులకు ప్రజాప్రతినిధులు, యువకులు పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలన్నీ భక్తి పాటలతో మార్మోగుతున్నాయి.
బియ్యం పంపిణీ
కేశంపేట : మండలంలోని 16 గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక సేవా సమితులకు ఆదివారం షాద్‌నగర్ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి బియ్యం పంపిణీ చేశారు. వినాయక మంటపాల వద్ద ప్రసాదం, అన్నదానం కోసం బియ్యాన్ని అందజేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దైవచింతనతోనే మనస్సుకు ప్రశాంతత
శంకర్పల్లి : దైవ చింతనతోనే మనస్సుకు ప్రశాంతత ఉంటుందని శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, శేరిగూడ సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం గ్రామంలో వినాయకుడికి పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.