సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
కొత్తగా రోడ్ల నిర్మాణంతోపాటు అవసరమైన ఫ్లై ఓవర్లను నిర్మించడంతోపాటు పచ్చదనం పెంపొందించేందుకు అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ బ్లాకులుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. తాజాగా మరో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేయనున్నది. శంషాబాద్-షాబాద్‌ల మధ్య వేలాది ఎకరాల్లో ఏ ర్పాటు చేసిన చందన్వెల్లి ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే చందన్వెల్లి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో భారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
దానికి సమీపంలోనే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ, మెక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వంటివి ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరుగనున్నది. 111 జీవో పరిధి దాటిన తర్వాత హైతాబాద్-షాబాద్‌ల మధ్య హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేయనున్నది.
శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే మార్గంలో చందన్వెల్లి పారిశ్రామికవాడకు సమీపంలో షాబాద్ రెవెన్యూ పరిధిలోని 311 సర్వేనంబర్‌లో ప్రభుత్వానికి చెందిన సుమారు 200 ఎకరాల భూమి ఉండగా.. దానిని ఖాళీగా ఉంచకుండా లేఅవుట్‌గా అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది.
దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుండటంతోపాటు అక్కడ నివాసాలు ఏర్పాటు కానున్నాయి. భూమిని స్వాధీనం చేసుకున్న హెచ్ఎండీఏ అధికారు లు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు సుమారు రూ.1.71 కోట్లతో ఇటీవలే టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 13వ తేదీని గడువుగా నిర్ణయించారు. లేఅవుట్ స్థలం చుట్టూ చైన్‌లింకు మెష్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒకేచోట పెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటంతో త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.