ఇబ్రపట్నం, ఆగస్టు 28 : రాచకొండ పోలీస్ కమిషనర్రేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష సజావుగా ముగిసింది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. 78,571మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 67,709మంది హాజరయ్యారు. ఒక్క ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోనే 22 సెంటర్లల్లో 15వేల పైచిలుకు అభ్యర్థులు హాజరై పరీక్షలు రాసారు. అభ్యర్థులు పెద్దఎత్తున పరీక్ష కేంద్రాలకు చేరుకుంటుండడంతో హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మహేశ్‌భగవత్ గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు విజయవంతంగా ముగించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలను నిర్వహించామన్నారు. ఔత్సాహికులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులతోపాటు ఫైనల్ పరీక్షలకు సమాయత్తం కావాలన్నారు. ఘట్కేసర్ అరోరా ఇంజినీరింగ్ కళాశాల, రామంతాపూర్ ప్రిన్స్టన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను కూడా సీపీ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎల్బీనగర్, యాదాద్రిభువనగిరి, మల్కాజ్గిరి, డీసీపీలతో పాటు ఇబ్రహీంపట్నం, భువనగిరి ఏసీపీలు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, ఆగస్టు 28 : వికారాబాద్ జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో 17,073 మందికి 16,227 మంది పరీక్ష రాశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది. వికారాబాద్, తాండూరు, పరిగిల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పూర్తి సౌకర్యాలు కల్పించారు. ఎస్పీ వెంట వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు ఉన్నారు.