రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పారిశ్రామిక రంగానికి నవశకం ఆరంభమైనది. రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా పేరొందిన జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఈ ఎనిమిదేండ్ల కాలంలో ముందుకొచ్చారు. ఎన్నో ఇండస్ట్రియ ల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు వచ్చాయి. అంతేకాకుండా దేశంలోనే ప్రముఖమైన పరిశ్రమలు వెల్స్పన్, క్రొనస్, టాటా, విజయ్నేహ, నాట్కో ఫార్మా, రెన్యూసిస్ కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్ లాంటి ప్రముఖ పరిశ్రమల సంస్థలను జిల్లాలో నెలకొల్పారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామిక రం గంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది, అంతేకాకుండా అనుమతి వస్తుందా..? రాదా అనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండటంతో చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నా రు. అంతేకాకుండా పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు సరఫరా చేస్తుండడంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా పరిశ్రమలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తూ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉండేది. పగలు రెండు గంటలు, రాత్రి వేళల్లో రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ చేసేవారు. కానీ అనధికారికంగా రోజుకు ఆరేడు గంటలపాటు సరఫరా నిలిచిపోయేది. గతంలో విద్యుత్ సరి గ్గా లేకపోవడంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా నిర్వాహకులు తమ కంపెనీలను మూ సుకోవాల్సిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిం దంటే చాలు చాలా కంపెనీలు పవర్ హాలీడేగా ప్రకటించేవి. దీంతో చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. కానీ.. ప్రస్తుతం పవర్ కట్కు రోజులు పో యాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మరిం త అభివృద్ధి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం వేసవిలోనూ పరిశ్రమలకు 24 గంటలపాటు సరఫరా చేస్తుండటంతో ఔత్సాహికులు పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాకు రూ.42,370 కోట్ల పెట్టుబడులు..
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ విధానంతో జిల్లాలో అధిక మొత్తంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారు టీఎస్-ఐపాస్ విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అవసరమైన అనుమతులను పదిహేను రోజుల్లో జారీ చేయడంతోపాటు నెలకొల్పే పరిశ్రమలను బట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికిస్థలాన్ని కేటాయించడం, విద్యుత్ కనెక్షన్..పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన వసతులను కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాలో టీఎస్ -ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుతో రూ. 42,370 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో అన్ని తరహా పరిశ్రమలు కలిపి మొత్తం 1,096 పరిశ్రమలు ఏర్పాటు కాగా, 4,63,536 మందికి ఉపాధి లభించింది. అయితే టీఎస్-ఐపాస్ కు వచ్చిన 1,473 దరఖాస్తులను ఇప్పటివరకు ఆమోదించగా.. వాటిలో 1,096 పరిశ్రమలు ప్రారంభమై తమ ఉత్పత్తులను కొనసాగిస్తుండటం గమనార్హం.