యాలాల ఆగస్టు 26 : రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో మండలంలోని కోకట్ గ్రామం కొత్తందాలను సంతరించుకున్నది. తాండూరు పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పచ్చని తోరణాల్లా దర్శనమిస్తున్నాయి. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల పక్కనే పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడంతో పచ్చని చెట్ల కింద విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మించారు. గ్రామ కూడలిలో ఓ వైపు రామాలమం మరోవైపు మసీదు ఇంకోవైపు అంబేద్కర్ విగ్రహం ఉన్నది. ఏ పండుగైనా గ్రామస్తులంతా కలిసి నిర్వహించుకుంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో యువకులు క్రీడలవైపు మొగ్గు చూపిస్తున్నారు. గ్రామంలో రైతువేదికను నిర్మించడంతో రైతులంతా సమావేశంలో సాగు సమస్యలు, విధానాలపై చర్చించుకుంటున్నారు.
పూర్తయిన ప్రగతి పనులు..
గ్రామంలో 4693 మంది జనాభా ఉన్నారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.3 లక్షలతో కంపోస్టుయార్డు, రూ.2 లక్షలతో పల్లెప్రకృతివనం నిర్మించారు. గ్రామ నర్సరీలో 14 వేల మొక్కలను పెంచి 12 వేల మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.
రూ.కోటి 50 లక్షలతో అభివృద్ధి..
మూడున్నర సంవత్సరాల కాలంలో రూ.కోటి 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.5 లక్షలు జడ్పీ, మిగతా జీపీ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు.