షాద్‌నగర్, ఆగస్టు 26 : విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్. జయలక్ష్మి అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖాన కార్యాలయం ఆవరణలో డివిజన్ మెడికల్ ఆఫీసర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దవాఖానల వైద్యులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అన్ని పీహెచ్సీలలో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని, అందుకు సంబంధిత సిబ్బంది సహకరించాలన్నారు. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో గర్భవతులను గుర్తించి, వారికి తగిన సలహాలు, సూచనలు చేస్తు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా టీకాలను త్వరగా పూర్తి చేయాలని, టీబీ రోగులు ఉంటే తక్షణమే గుర్తించి తగిన వైద్య పరీక్షలు, సేవలు అందించాలని చెప్పారు. ప్రతి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్యాలపై ఆరా తీయాలని, అనారోగ్యాలకు గరైతే తగిన వైద్యాన్ని అందించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.