రంగారెడ్డి, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ) : ప్రతి ఏడాది ఆడపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మ పండుగకు అందించనున్న సర్కారు చీరలు ఈ నెలాఖరుకు జిల్లాకు చేరుకోనున్నాయి. మరో పది రోజుల్లో 50 శాతం మేర చీరలు జిల్లాలోని ఆయా గోదాములకు చేరనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని ఆడబిడ్డలను సొంతబిడ్డల్లా భావిస్తున్న సీఎం కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు కానుకగా చీరలను పంపిణీ చేస్తూ వస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను అందజేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.12 కోట్లను ఖర్చు చేస్తున్నది. చీరలు నాణ్యతతో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బతుకమ్మకు వారం రోజుల ముందు..
బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందు నుంచి ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు లేదా ఇతర ఏదేని గుర్తింపు కార్డులను చూపించినట్లయితే చీరలను అందజేయనున్నారు. మరోవైపు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే చీరల తయారీ జరుగుతుండడంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో వేల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి.
ఈ ఏడాది అర్హులు 7.28 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రతి ఏటా అందిస్తున్న పండుగ కానుక చీరలు జిల్లాకు వారం రోజుల్లో చేరుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా జిల్లాకు మొదటి విడుతగా కొంతమేర చీరలను తీసుకురానున్నారు. జిల్లాలోని కందుకూరు మండలంలోని కొత్తూరులోని గోదాంతోపాటు మొయినాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో నిల్వ ఉంచనున్నారు. జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 7.28 లక్షల మంది ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లెక్కతేల్చారు. మొయినాబాద్ గోదాం నుంచి చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు, కొత్తూరు గోదాం నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు బతుకమ్మ చీరలను చేరవేయనున్నారు.
పోచంపల్లి, సిరిసిల్ల, కోయిలకొండ, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో తయారు చేసిన బతుకమ్మ చీరలు జిల్లాకు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రతి ఆడపడుచు నచ్చేలా సరికొత్త డిజైన్లు, రంగులతో చేనేత కార్మికులు చీరలను తయారు చేశారు. బతుకమ్మ చీరలకు సంబంధించి 200 రంగులు, 70 డిజైన్లు, యువతులు, మహిళల కోసం 6.3 మీటర్లు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలను సిద్ధం చేశారు. ప్రతి చీరతోపాటు 80 సెంటీమీటర్ల జాకెట్ పీస్ అందజేయనున్నారు.
చీరల పంపిణీకి కమిటీలు
చీరల పంపిణీకి మండల, గ్రామస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో.. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, రేషన్ డీలర్లు కమిటీల్లో ఉండనున్నారు. గ్రామాల్లో రేషన్ దుకాణాలు, గ్రామపంచాయతీల ద్వారా, మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీ కార్యాలయాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.
వారం రోజుల్లో జిల్లాకు బతుకమ్మ చీరలు- జంగారెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ
ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా అందించే చీరలు జిల్లాకు వారం రోజుల్లో రానున్నాయి. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొయినాబాద్‌లోని మార్కెట్ కమిటీ గోదాంతోపాటు కందుకూరు మండలంలోని కొత్తూరులోని గోదాంలో నిల్వ చేయనున్నాం. ఆయా గోదాంల నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బతుకమ్మ చీరలను చేరవేస్తాం.