ఆదిబట్ల, ఆగస్టు 22 : ఈ నెల 25న ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అందుకోసం జిల్లా అధికారులు పెండింగ్ పనులను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. నూతన కార్యాలయంలో ఫర్నిచర్, ఏసీలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల వంటి పలు పనులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని పూర్తి చేశారు. నీటి సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు రోడ్లను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. నూతన లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో పనులను కలెక్టర్ అమయ్‌కుమార్ పర్యవేక్షించారు.
15 ఎకరాల్లో 30వేల మందితో బహిరంగ సభకు ఏర్పాటు
నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించగానే భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ భవనానికి ముందుభాగంలో టీఎస్ఐఎస్కు చెందిన 30 ఎకరాల భూమి ఉండటంతో అందులో నుంచి 15 ఎకరాల భూమిలో 30 వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని జేసీబీలు, ఇటాచీలతో చదును చేస్తున్నారు. ఈ పనులను జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు దగ్గరుండి చూసుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో పనులు వెంటనే పూర్తిచేయాలని వారు ఆదేశించారు.
సమయం లేదు.. ఏర్పాట్లు పూర్తి చేయండి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
సమయం లేదు.. ఏర్పాట్లు తొందరగా పూర్తి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కొంగరకలాన్‌లో నిర్మితమైన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ పనులను ఆయన పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి), ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, కౌన్సిలర్ కృష్ణంరాజు, టీఆర్ఎస్ పార్టీ ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, నాయకులు కోరె జంగయ్య, పయిళ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.