షాబాద్, ఆగస్టు 21 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వానకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు చేపట్టారు. పంటలు సాగు చేయడానికి, దిగుబడి వచ్చిన పంటలను కొనుగోలు చేసేందుకు సర్కార్ రైతుకు అండగా నిలవడంతో అన్నదాతలు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు.
ఈ ఏడాది మొదటి నుంచి వర్షాలు అనుకున్న స్థాయిలో కురుస్తుండడంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకొని పంటలు సాగు చేపట్టారు. రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 2.85లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడూ అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగులో మంచి దిగుబడులు వచ్చే అవకాశాలున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 2.85లక్షల ఎకరాల్లో పంటల సాగు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజవర్గాల పరిధిలోని 25 మండలాల్లోని గ్రామాల్లో రైతులు ఇప్పటివరకు మొత్తం 2.85లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పత్తి 1,55,622 ఎకరాలు, మక్కజొన్న 70,322 ఎకరాలు, వరి 35,462 ఎకరాల్లో వేయగా, మరో 41,858 ఎకరాల్లో వేసేందుకు సిద్ధంగా ఉంది. అదే విధంగా కంది 16,948 ఎకరాలు, జొన్న 3,049 ఎకరాలు, మరో 3,200 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
పత్తి పంటపై రైతుల ఆసక్తి..
ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో రైతులు అత్యధికంగా పత్తిపంట సాగుపై దృష్టి సారించారు. జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో అత్యధికంగా రైతులు పత్తిపంటను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు బోరుబావుల కింద పొలాల్లో వరిపంట సాగు చేపడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పత్తి, వరి, మక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి.
2.85లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 2.85లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటల సాగు చేపట్టారు. అత్యధికంగా పత్తి, మక్కజొన్న, వరి పంటలు వేయడం జరిగింది. ఈ నెల చివరి వరకు వరిసాగు మరింత పెరిగే అవకాశం ఉంది. పంటలకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సదస్సులు నిర్వహించి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
– గీతారెడ్డి, రంగారెడ్డిజిల్లా వ్యవసాయశాఖ అధికారి
పది ఎకరాల్లో పత్తి వేశా
ఈ వానకాలంలో పది ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. వర్షాలు బాగా కురవడంతో పంట పూత దశలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం ద్వారా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుని పంటలు సాగు చేస్తున్నాం. అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పత్తి పంటలో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం.
– చెన్నయ్య, రైతు, బోడంపహాడ్ (షాబాద్)
రెండెకరాల్లో వరి పంట వేశా..
బోరుబావి కింద రెండెకరాల్లో వరిపంట సాగు చేశా. మూడేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో బోర్లలో నీటిమట్టం పెరిగింది. ప్రభుత్వం 24గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయం సస్యశ్యామలంగా మారింది. కొద్దిగా దొడ్డు రకం, ఎక్కువగా సన్నరకం వరి పంట సాగు చేశా. రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– పెద్దగోల్ల అంజయ్య, రైతు, కుమ్మరిగూడ(షాబాద్)