ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ సమీపంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నట్లు మ్ంరత్రి సబితాఇంద్రారెడ్డి అధికారికంగా వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టరేట్ పక్కనే బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మంత్రి సబితారెడ్డితో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 21: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 40 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో రూ.58 కోట్లతో 105 విశాలమైన గదులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులో 29 గదులు, రెండో అంతస్తులో 24 గదులను నిర్మించారు. జిల్లాకు చెం దిన 40 శాఖల అధికారులు ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేలా కొంగరకలాన్ వద్ద రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారని జిల్లామంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారికంగా వెల్లడించారు. అనంతరం దానిపక్కనే జరుగనున్న బహిరంగ సభ నిర్వహణకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారితోపాటు పలు శాఖల అధికారులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
40 ఎకరాల్లో రూ.58 కోట్లతో..
కొంగరకలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో 40 ఎకరాల్లో రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. గతంలో ఈ స్థలాన్ని రైస్ హబ్ నిర్మాణం కోసం కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ.. ఈ స్థలంలో కలెక్టరేట్ నిర్మిస్తే అన్ని రకాలుగా అనువుగా ఉం టుం దని భావించారు. దీంతో ఈ స్థలా న్ని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించగా నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది.
తీరనున్న ప్రజల ఇబ్బందులు..
రంగారెడ్డి జిల్లా ప్రస్తుత కలెక్టరేట్ హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉంది. మంచాల, యాచారం, షాబాద్, తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజావాణితోపాటు పలు వినతులను అధికారులకు సమర్పించేందుకు ట్రాఫిక్‌ను తట్టుకుని వెళ్లాల్సి వస్తున్నది. నూతన కలెక్టరేట్ కొంగరకలాన్‌లో ప్రా రంభం కానుండటంతో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఓఆర్ఆర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలేకుండా కలెక్టరేట్‌కు చేరుకోవ చ్చు. అలాగే, నగరం, శివారుల్లోని పలు డిపోలకు చెందిన బస్సులను కూడా కలెక్టరేట్ వరకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రారంభానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో.. వారికి భోజనం, తాగునీరు ఇతరత్రా సదుపాయాలను కల్పించేందుకు అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు బాధ్యతలను అప్పగించా రు. ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మారనున్న ప్రాంత రూపురేఖలు
రంగారెడ్డి కలెక్టరేట్ కొంగరకలాన్‌లో ప్రారంభమై తే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 25న సీఎం కేసీఆర్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగసభాస్థలిని ఆమె ఆదివారం పరిశీ లించి మాట్లాడారు. ఇప్పటికే రంగారెడ్డి ధనిక జిల్లాగా పేరొందిందన్నారు. తుక్కుగూడ, బొంగుళూరు, ఆదిబట్ల, శంషాబాద్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతా లు అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నాయని .. ఈ ప్రాంతంలో పలు పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటైనట్లు వివరించారు.
ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండటంతో ప్రజలు అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కొంగరకలాన్‌లో 40 ఎకరాల్లో రూ.58 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యా లయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించినట్లు చెప్పారు. జిల్లాకు సంబం ధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఈ నెల 25 తేదీన సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని.. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మంత్రి సబితారెడ్డి వెంట జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ కళమ్మ, ఆర్డీవో వెంకటాచారి, కౌన్సిలర్లు శ్రీనివాస్, కృష్ణంరాజు, మహేందర్, రాజేశ్, జంగయ్య, తదితరులున్నారు.
పెండింగ్ పనులను పూర్తి చేయాలి
ఆదిబట్ల, ఆగస్టు 21: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్మాణం పూర్తైన రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 25తేదీ మధ్యాహ్నం ప్రారంభిస్తారని జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు తెలిపారు. ఆదివా రం వారు నూతన కలెక్టరేట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని.. ఔటర్ రింగు రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు వచ్చే రోడ్డులో మరిన్ని మొక్కలను నాటడంతోపాటు లైటింగ్‌ను సరిచేయాలని సూచించారు. అదేవిధంగా కలెక్టరేట్ వెనుక వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పనులను త్వరగా జరిగేందుకు అధికారులందరికీ బాధ్యతలను అప్పగిస్తామన్నారు. అనంతరం వారు బహిరంగ సభ కోసం కలెక్టరేట్‌ను ఆనుకొని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, ఆర్డీవో వెంకటాచారి, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.