కడ్తాల్, ఆగస్టు 15 : నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామంలో కొత్త ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆసరా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఆగస్టు 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లు అందజేశారని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆరు వేల ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నానని, అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని అన్మాస్‌పల్లి, చల్లంపల్లి, బాలాజీనగర్ గ్రామాలకు చెందిన 48 లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులను అందజేశారు. ఆమనగల్లులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొత్త పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
భక్తిశ్రద్ధలతో సాయీశ్వరలింగ, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
కడ్తాల్‌లోని షిరిడీ, సత్యసాయి, హనుమాన్‌ఘడ్ ఆంజనేయస్వామి ఆలయాల్లో సోమవారం గణపతి, దత్తాత్రేయ, బసవేశ్వరుడు, నందీశ్వర, కాశీవిశ్వేశ్వేరస్వామి సహిత నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు వెంకటేశ్వరశర్మ, మఠం శేఖరయ్య ఆధ్వర్యంలో ఉదయం హోమాలు, యంత్ర ప్రతిష్ఠ, మహా మంగళ హారతి, సకల దేవాతారాధన, అభిషేకాలు, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అర్చకులు, ఎంపీడీవో, ఎంపీవో, నాయకులున్నారు.