రంగారెడ్డి, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ) : జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కానున్నది. ఈ నెల 22వ తేదీలోగా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 వరకే మంచి ముహూర్తాలు ఉండడంతో ఆలోగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయమిచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ నూతన కలెక్టరేట్లను ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయించడంతో సంబంధిత రెండు కలెక్టరేట్లను ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోగా రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. 15న మధ్యాహ్నం 3 గంటలకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించి చర్చించనున్నారు. అదేరోజు రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తికావడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు.
నూతన కలెక్టరేట్లో కలెక్టర్ కార్యాలయంతోపాటు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ఇతర అధికారుల కార్యాలయాలు.. బ్యాంకు, ఏటీఎం, దవాఖాన తదితరాలకు గదుల కేటాయింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల అధికారులకు కేటాయించిన గదులకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో 42 గదులు, మొదటి అంతస్తులో 29 గదులు, రెండో అంతస్తులో 34 గదులను ఆయా శాఖలు కలిపి మొత్తం 105 విశాలమైన గదులను నిర్మించారు. మరోవైపు ఆయా శాఖలకు గదుల కేటాయింపును బట్టి ఫర్నిచర్‌ను కూడా సమకూర్చారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు నూతన కలెక్టరేట్ నుంచి పనిచేసేందుకు దస్ర్తాలను, ఇతర సామగ్రిని సిద్ధం చేసి ఉంచారు. కొంగరకలాన్‌లోని సర్వే నం.300లోని 40 ఎకరాల్లో రూ.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను నిర్మించారు.
గ్రౌండ్ ఫ్లోర్లో 42 గదులు
గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ చాంబర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్ అండ్ బీ శాఖ, కలెక్టరేట్ పరిపాలన అధికారి, కలెక్టరేట్ రెవెన్యూ విభాగాలు, జిల్లా సహకార అధికారి, ఈ-జిల్లా మేనేజర్, మహిళా-శిశు సంక్షేమం, డీఐవో, ఎన్ఐసీ, టీ-ఫైబర్‌తోపాటు రికార్డు గది, స్ట్రాంగ్‌రూం, ఎలక్ట్రిసిటీ గది, స్టోర్ గది, మినీ కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరం, వెయిటింగ్ హాల్, లంచ్, రెస్ట్ గదులు, పోస్టాఫీస్, బ్యాంక్, ఏటీఎం, షాప్, దవాఖాన, రెడ్‌క్రాస్‌కు గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించారు.
మొదటి అంతస్తులో 29 గదులు
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, నీటి పారుదల శాఖ, డిపిఆర్వో, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ, జిల్లా ఖజానా అధికారి, ఎస్డీసీ(ఎల్పీ), జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, ఎస్డీసీ(ఎల్ఏ), ఎస్డీసీ(యూఎల్సీ), ఎలక్ట్రిసిటీ గది, సర్వర్ గది, సమావేశ మందిరం, బీఎస్ఎన్ఎల్ సర్వర్‌కు మొదటి అంతస్తులో గదులను కేటాయించారు.
రెండో అంతస్తులో 34 గదులు
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్, ముఖ్య ప్రణాళిక అధికారి, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్, గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయం, గనులు, భూగర్భశాఖ ఏడీ, ఏడీ(ఎల్-ఎస్ఆర్), జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ప్రొబెషనరీ అధికారి, హౌసింగ్ పీడీ, మెప్మా పీడీ, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, మత్స్యశాఖ ఏడీ, జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయాలకు రెండో అంతస్తులో గదులను కేటాయించారు.
2:40కి ముహూర్తం ఈ నెల 16న
వికారాబాద్‌లో రూ.60.70కోట్లతో నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 16న మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభించనున్నారు. వికారాబాద్ జిల్లాకు రోడ్డు మార్గం ద్వారానే రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ నుంచి సీఎం బయలుదేరి 2 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటారు. సిద్దులూర్ రోడ్డులో నిర్మాణం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనానికి చేరుకొని నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి 4.05 గంటలకు కలెక్టరేట్ పక్కనే ఏర్పాటు చేసే బహిరంగ సభావేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.05 గంటల నుంచి 5.15 గంటల వరకు బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరుతారు. ఈమేరకు అధికారులు సీఎం కేసీఆర్ పాల్గొనే పర్యటన ఏర్పాట్లు చేపడుతున్నారు.